జిల్లాకు క్రీడా పాఠశాల

Sep 29,2024 20:37

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : జిల్లాలో త్వరలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని శాప్‌ ఎమ్‌డి గిరీశ పిఎస్‌ హామీ ఇచ్చారు. ఖోఖో, కబడ్డీ అకాడమీని కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని డిఎస్‌డిఒను ఆయన ఆదేశించారు. ఆదివారం జిల్లాలో శాప్‌ ఎమ్‌డి పర్యటించారు. విజ్జి స్టేడియంలో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజుతో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం ప్రారంభానికి సిద్ధం చేయడానికి కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఈ స్టేడియం అమ్మవారి పండుగ నాటికి ప్రారంభించాలని, అక్టోబరు పదో తేదిలోగా అప్పగించాలని శాప్‌ ఇంజినీర్లను ఎమ్‌డి ఆదేశించారు. స్టేడియంలోని బాక్సింగ్‌ రింగ్‌కు అవసరమైన పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు జెడ్‌పి అతిథి గృహం వద్ద ఆయనను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆర్‌డిఒ కీర్తి కూడా ఉన్నారు. ఈ పర్యటనలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, విశాఖ క్రీడాభివృద్ధి అధికారి జూన్‌ గాలియట్‌, సిపిడబ్యు ఇంజినీర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️