జానపద కళాకారుడు జానకిరామ్ హుషారైన జానపద గీతాలకు డప్పు శ్రీను బృందం డప్పుపై దరువేస్తూ ఆడుతుంటే..? గుండె ఝళ్లుమనేలా శంకరరావు బృందం తప్పెటగుళ్లు వాయిస్తుంటే? శృంగవరపుకోట విద్యార్థినులు గిరిజన సంప్రదాయ నృత్యం థింసా ప్రదర్శనతో కట్టిపడేస్తుంటే? చూడచక్కగా చీపురుపల్లి, గొల్లపల్లి విద్యార్థినులు కోలాటం ఆడుతుంటే?హుషారైన సినిమా పాటలకు విద్యార్థులు స్టేజి దద్దరిల్లేలా స్టెప్పులేస్తుంటే? …ఇంకేముంది కన్నుల పండగే. ఇలాంటి అద్భుత ప్రదర్శనలు చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అంతకు మించిన ఆనందం, వినోదం మరోచోట దొరకదు. అందుకే అలాంటి వినోదాన్ని విద్యార్థులకు, యువతకు పంచడమే లక్ష్యంగా ఎస్‌ఎఫ్‌ఐ.. భగత్‌సింగ్ స్టూడెంట్ ఫెస్ట్‌ను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా, వినోదం, విజ్ఞానంతోనే అసలైన ఆనందమంటూ మూడు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శన, మ్యాజిక్‌షో.. ఆహూతులను ఉర్రూతలూగించాయి.
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: సమాజంలో యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో మత్తు పదార్థాలతోనే ఆనందం కాదు విజ్ఞానం, వినోదంతో అసలైన ఆనందం.. అంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన స్థానిక గురజాడ కళాభారతి ఆవరణలో నిర్వహించిన భగత్‌సింగ్ ఫెస్ట్ విద్యార్థులను, యువతను చైతన్యపర్చింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కళాశాలలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొని ఆట పాటలతో అలరించారు. డ్రగ్స్, గంజాయి వల్ల కలిగి నష్టాలను నృత్యరూపకంలోను, ఆట పాటల్లోను వివరించారు. సమాజంలో మన బాధ్యత ఏమిటి, భావి భారత పౌరులుగా మన కర్తవ్యాలు ఏమిటి అనే విషయాలు చెబుతూ పాటలు ద్వారా, కోలాటం, డప్పు వాయిద్యాలతో, రేలా రేలా కార్యక్రమం ద్వారా అభ్యుదయ గీతాలు ఆలపించి ప్రజలను ఆలోచింప చేశారు. ప్రధానంగా తప్పెట గుళ్లతో శంకరరావు మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ తన బృందంతో ఆడి, పాడి వివరించారు. రేలా రేలా కార్యక్రమం ద్వారా జానకిరామ్ బృందం దేశభక్తి గీతాలు, మన జాన పద గీతాలు ఆలపించి అందులో ఉండే ఆనందాన్ని వివరించారు. భగత్ సింగ్, గాంధీ స్ఫూర్తితో ఉద్యమిద్దాంస్వాతంత్య్ర పోరాట యోధులైన గాంధీజీ, భగత్ సింగ్ చరిత్ర తెలియకుండా చేసేందుకు పాఠ్యాంశాల నుంచి తొలగిస్తున్న నేటి తరుణంలో వారు అందించిన పోరాట స్ఫూర్తితో ఉపాధి అవకాశాలు కోసం, నిరుద్యోగ యువతను డ్రగ్స్ నుంచి దూరం చేసే విధంగా పోరాటాలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ పిలుపునిచ్చారు. ఫెస్ట్ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నాయని అన్నారు. ఉపాధి అవకాశాలు లేక పని దొరక్కా యువత చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి మాఫీయాలు ఎక్కువయ్యాయన్నారు. వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. నేడు యువత డ్రగ్స్ గంజాయి వంటి వాటికి బానిస కాకుండా విజ్ఞానం, వినోదంతో మంచి ఆనందం ఉందనే ప్రయత్నంలో భాగంగా ఫెస్ట్ కార్యక్రమాలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహిస్తోందన్నారు. రానున్న కాలంలో ఎస్ ఎఫ్‌ఐ నిర్వహించే పోరాట కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా యువత శాస్త్రీయ ఆలోచన వైపు వెళ్లే విధంగా నేడు సమాజంలో డ్రగ్స్,గంజాయి భారిన పడకుండా భగత్‌సింగ్ ఫెస్ట్ నిర్వహించామన్నారు. ఫెస్ట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములై ఆరోగ్య కరమైన సమాజం కోసం ముందుకు రావాలని కోరారు. మూడు రోజులు పాటు జరిగిన ఫెస్ట్ కార్యక్రమాన్ని తిలకించేందుకు వందల సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు హాజరయ్యారు.