జిల్లాకు విద్యార్థి కిట్లు

Jun 11,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఈ నెల 13 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అన్నింటినీ అందజేసేందుకు జిల్లా విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే సగానికి పైగా పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోగా, వాటిని పాఠశాలలకు చేరవేశారు. యూనిఫాం మినహా మిగతా సామగ్రి కూడా జిల్లాకు చేరుకుంటోంది. వాటిని కూడా విద్యార్థులకు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.జిల్లాలోని 1642 పాఠశాలకు సంబంధించి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆ స్కూళ్ల నుంచి 9.15 లక్షల పాఠ్య పుస్తకాలు ప్రతిపాదన పెట్టగా, 63 శాతం ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. వాటిని ఆయా మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేశారు.
జగనన్న విద్యా కానుక (జెవికె) పేరున స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు, బ్యాగులు గత ఐదేళ్లలో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో విద్యా కానుక కిట్లకు బదులుగా ‘స్టూడెంట్‌ కిట్‌’గా పేరు మార్చి స్కూల్‌ బ్యాగులపై గతంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఫొటో కూడా తీసివేశారు. ఈ కిట్లలో ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు ఉంచి స్కూళ్ల వారీగా కేటాయించి పంపిణీ చేశారు. అన్ని స్కూళ్లన్నింటికీ బెల్టులు, షూల కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలాల్లో స్టూడెంట్‌ కిట్లు సమగ్ర శిక్ష సిబ్బందితో మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే చేరవేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది.పాఠశాలల్లో విద్యార్థులు ఇలా.. జిల్లాలోని 27 మండలాల్లో 1642 ప్రభుత్వ పాఠశాలల్లో 1,41,479 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో బాలురు 66,604 మంది, బాలికలు 73,875 మంది. అన్ని చోట్లా విద్యార్థులకు పూర్తిస్థాయిలో సక్రమంగా కిట్లు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాకు చేరుకొని యూనిఫాం
విద్యార్థి కిట్లలో ఉండాల్సిన సామగ్రిలో నోట్‌ పుస్తకాలు 98.5 శాతం, బ్యాగులు 71.5 శాతం, బెల్టులు 99.5 శాతం, షూలు 26 శాతం రాగా, యూనిఫాం పూర్తిగా నేటి వరకు చేరుకోలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో విద్యార్థి కిట్లు నూతన ఎమ్మెల్యేలతో పండగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కిట్లు అన్ని సిద్ధం చేసి విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆయా మండలాలకు ఎన్ని కిట్లు, విద్యార్థుల సంఖ్య.. వంటి వివరాలు విద్యా శాఖాధికారులు పంపించే పనిలో నిమగమై ఉన్నారు.

➡️