సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలి

Jun 10,2024 19:10
  • కలెక్టర్‌కి ఎపి రైతు సంఘం వినతి
    ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైందని, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, ఉపాధ్యక్షులు ఎల్‌.ఆదినారాయణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, కౌలుదారులకు వరి, తదితర పంటలకు రాయితీపై నాణ్యమైన విత్తనాలు ఆర్‌బికెల్లో ఉంచాలన్నారు. ఎరువులు, పురుగుమందులు ఆర్‌బికెల్లో అందుబాటు లో ఉంచాలని కోరారు. విత్తన, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నాసిరకం అరికట్టడానికి పర్యవేక్షణ చేయాలని తెలిపారు. 1121 రకం వరి విత్తనం చీడపీడలకు, కోత సమయంలో వర్షాలకు తడిసి వేగంగా మొలకరావడం, ఇతర కారణాల వల్ల దెబ్బతినడం, దిగుబడులు తగ్గటంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. జిల్లా వాతావరణ, భూసార పరిస్థితులకు అనువైన, అధిక దిగుబడినిచ్చే, చీడ పీడలను తట్టుకొనే విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. వెంటనే కాలువల్లో పూడికలు తీయించాలన్నారు. ఇటీవల ఈదురు గాలులకు అరటి, వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని, వాటికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పిడుగుపాటుకు మృతి చెందిన పశువులు, గొర్రెలు, మేకలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
➡️