ప్రజాశక్తి – బొబ్బిలి : బొబ్బిలిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం నిర్వహించారు. సిబిఎం చర్చి క్రైస్తవులు ఈత కొమ్మలతో పట్టణంలో నగర సంకీర్తన చేశారు. సైంట్ ఆండ్రూస్ లూథరన్ చర్చిలో మట్టల ఆదివారం నిర్వహించారు. మానవాళి రక్షణ కోసం క్రీస్తు ప్రభువు సిలువ మీద చూపిన ప్రేమ, క్షమాగుణం ప్రతివారు కలిగివుండి ఇతరులకు ఆ ప్రేమను చూపించాలని మహారాణి పేటలోని సైంట్ ఆండ్రూస్ లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ జాన్ విక్టర్, సిబిఎం చర్చి ఫాదర్ అశోక్ అన్నారు. పాస్టర్ జాన్ విక్టర్, చర్చ్ డెలిగేట్ జెసి రాజు ఆధ్వర్యంలో మట్టలను ప్రదర్శించారు. కార్యక్రమంలో క్రైస్తవులు పాల్గొన్నారు.రామభద్రపురం: ఆరికతోట ఎడిఎం బాప్టిస్ట్ చర్చి కాపరుల ఆధ్వర్యలో తెల్లవారు జాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈత, ఖర్జూర మట్టలను పట్టుకొని ఆదివారం వీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం యేసు క్రీస్తు నామాన్ని జపిస్తూ చర్చల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు క్రీస్తు శత్రు సంహారం చేసి గాడిద పిల్లల నిక్కి గ్రామ సంచారం చేసేందుకు వస్తుండగా ఆ గ్రామ ప్రజలంతా యేసయ్యకు స్వాగతం పలికేందుకు వివిధ చెట్ల మట్టలను, వస్త్రాలను పరచి ఆహ్వానించిన రోజు ఈ పవిత్ర దినంగా బావించి ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు సంఘ కాపరులు తెలిపారు.విజయనగరం టౌన్ : నగరంలో ఆదివారం ఏసుప్రేమాలయం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ర్యాలీ ఘనంగా చేపట్టారు. పాస్టర్ అలజంగి రవికుమార్ ఈ ర్యాలీని ప్రారంభించి మట్టల ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు. అంబటిసత్రం కూడలిలో ఏసు ప్రేమాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మూడు లాంతర్లు కూడలి, గంటస్థంభం కూడలి, పార్కుగేట్ కూడలి మీదుగా కమ్మవీధి గుండా తిరిగి ఏసు ప్రేమాలయానికి చేరుకుంది.
