ప్రమాణ స్వీకారానికి తెలుగు తమ్ముళ్లు

Jun 11,2024 21:20

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సిఎం ప్రమాణ స్వీకారానికి తెలుగు తమ్ముళ్లు విజయవాడలోని కేసరపల్లికి తరలివెళ్లారు. కొందరు బస్సుల్లోనూ, మరికొందరు రైళ్లు, ఇంకొందరు కార్లలోనూ మంగళవారం ఉదయం నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి టిడిపి, జనసేన పార్టీలకు చెందిన విఐపిలు, వివిఐపిలకు గడిచిన రెండురోజులూ ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. కారు ఎంట్రీ పాసులను కూడా జారీచేశారు. ముఖ్యంగా ప్రభుత్వం తరపున ప్రతి నియోజక వర్గానికి నాలుగు బస్సులు చొప్పున విజయనగరం జిల్లాలో 28 బస్సులు, పార్వతీపురం మన్యం జిల్లాలో 16 ఏర్పాటు చేశారు. ఈ లెక్కన మండలానికి ఒకటి చొప్పున బస్సులను కేటాయించారు. ప్రతి గ్రామం నుంచీ కనీసం ఒక ప్రతినిధిని బస్సుల్లో పంపే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇవి కాకుండా స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనాలను పార్టీ తరపున, వ్యక్తిగతంగాను బుక్‌ చేశారు. ఈ బస్సులన్నీ మంగళవారం మధ్యాహ్నం నుంచి బయల్దేరాయి. ఈ మేరకు ప్రభుత్వం తరపున జిల్లా అధికారులే బస్సులను సమకూర్చారు. ఇందులో ప్రయాణించేవారి దారి ఖర్చులు, భోజనాలు, తదితరాలన్నీ ఎమ్మెల్యేలు, నాయకులు చూసుకుంటున్నట్టుగా సమాచారం. ఈనేపథ్యంలో టిడిపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి వెళ్లే నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వం తరపున పాసులు కూడా అందజేశారు. ఈ లెక్కకు మించి తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి టిడిపి జిల్లా కార్యాలయం (అశోక్‌ బంగ్లా) సందడిగా కనిపించింది. ఇక్కడి నుంచి బయలుదేరిన కార్లు ప్రత్యేక కాన్వారుని తలపించాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా జనసైనికుల ప్రయాణం కూడా ఎక్కువగానే కనిపించింది. ఇలా వెళ్లిన నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా కూర్చొనేందుకు వీలుగా అక్కడి ప్రమాణ స్వీకార సభలో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి గ్యాలరీకి ఒకటి లేదా రెండు చొప్పున ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం. జిల్లా ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా జిల్లా కేంద్రాలు, మండలంలోని ముఖ్యమైన కూడళ్లలో ఎల్‌ఎడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. విజయనగరంలోని కలెక్టరేట్‌, ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించనున్నారు.ఎవరికి వారే తమ ఎమ్మెల్యేకు రాష్ట్ర మంత్రి పదవి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలంతా రెండు రోజుల క్రితమే విజయవాడ చేరుకుని పార్టీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లను కలిసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన టిడిపి, ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రభుత్వ భవనాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు, ముఖ్యమైన కూడళ్లను ప్రత్యేక విద్యుత్తు అలంకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో విజయనగరంలోని పైడితల్లమ్మ ఆలయం, కోట, గంటస్తంభం, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, సంస్కృత కళాశాల, కలెక్టరేట్‌, మర్రి చెన్నారెడ్డి భవన్‌, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి, జిల్లా పరిషత్తు, దేవాదాయ శాఖ కార్యాలయ సముదాయాలు సోమవారం రాత్రి నుంచి విద్యుత్తు అలంకరణ చేశారు.

➡️