ప్రజాశక్తి-భోగాపురం : వారిద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగారు… పెరిగారు. కాని విధి వారిపట్ల చిన్నచూపు చూసింది. స్నేహితుడి కారులో విశాఖపట్నం బయలుదేరారు. విదేశాల నుంచి వస్తున్న బంధువులను తీసుకొచ్చేందుకు వెళ్తున్నానని తోటి స్నేహితుడికి చెప్పగా, తన భార్యకు బ్యాంకు ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష విశాఖలో ఉందని మరొకరు చెప్పడంతో అంతా బయలుదేరి వెళ్లారు. ఇంతలో పోలిపల్లి వద్ద అనుకోని ప్రమాదంలో డ్రైవరుతో సహా నలుగురు మృతి చెందారు. దీంతో మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన వడ్డే అభినవ్ (27), ఆయన భార్య మణిమాల (24), గవిడి కౌశిక్ (27), డ్రైవర్ మోడి జయేష్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన తూర్పుకాపు సంఘం నాయకులు లంకా బావాజినాయుడు కుమార్తె కుమారుడు వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అందుకు అమెరికాలో ఉంటున్న బావాజినాయుడు కుమారుడు వస్తుండటంతో, వరుసకు మేల్లుడైన గవిడి కౌశిక్ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరాడు. ఈ విషయాన్ని స్నేహితుడైన అభినవ్‌కు శుక్రవారం రాత్రి చెప్పాడు. తన భార్య మణిమాలకు విశాఖలో బ్యాంకు ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష ఉందని అభినవ్ చెప్పడంతో కలిసి వెళ్దామని అనుకున్నారు. ముందురోజు అనుకున్నట్లే అంతా కలిసి కౌశిక్ కారులో బయలుదేరారు. ముందు సీట్లో కౌశిక్ కూర్చోగా, వెనుక సీట్లో అభినవ్ దంపతులు ఉన్నారు. అతివేగంగా వస్తున్న కారు పోలిపల్లి వద్దకు వచ్చేసరికి టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి అతి వేగంగా డివైడర్ పైనుంచి విశాఖ-శ్రీకాకుళం మార్గంలో ఎదురుగా వస్తున్న లారీని ఢకొీంది. దీంతో కారులో ఉన్న వారంతా అక్కడకక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ జయేష్ మృతదేహాన్ని అతి కష్టమ్మీద తీశారు. సమాచారం అందుకున్న సిఐ ప్రభాకర్, ఎస్‌ఐలు పాపారావు, సూర్యకుమారితోపాటు హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి వాటిని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని విజయనగరం ఎఎస్‌పి పరిశీలించారు. మూడు కుటుంబాల్లో విషాదఛాయలు ఈ ప్రమాదంతో శ్రీకాకుళం పట్టణంలో మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కౌశిక్ తండ్రి శ్రీకాకుళం పట్టణంలోని పేర్లవారి వీధిలో బంగారం దుకాణం నిర్వహిస్తుంటారు. ఇదే పట్టణానికి చెందిన ప్రముఖ నగల వ్యాపారి లంకా గాంధీ కుమార్తెతో ఏడాది క్రితమే ఆయనకు వివాహమైంది. తండ్రికి చేదోడువాదోడుగా కౌశిక్ ఉండేవాడు. వడ్డే అభినవ్ తండ్రి మన్మథరావుతో కలిసి పట్టణంలో లియో పేరుతో మెడికల్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు. మూడేళ్ల కిందట మణిమాలతో వివాహం జరగగా, వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. ఆ బాలుడు అనాథ అయ్యాడు. డ్రైవర్ జయేష్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి సున్నపువారి వీధిలో టీ దుకాణం నడుపుతోంది. ఇప్పుడు కుమారుడు కూడా చనిపోవడంతో తనను అనాథని చేసి వెళ్లిపోయావంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.అతివేగంతో అటు నుంచి ఇటు.. టొయాటో కంపెనీకి చెందిన ఫార్చునర్ కారులో వీరంతా శ్రీకాకుళం నుంచి బయలుదేరి వస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కాని పోలిపల్లి వంతెన పైనుంచి దిగిన తరువాత ఒక్కసారిగా అతివేగంతో దూసుకొచ్చింది. ఇంతలో టైరు పేలిపోవడంతో కారు ఏకంగా డివైడర్ పైనుంచి అవతల వైపు అనగా శ్రీకాకుళం వైపు వెళ్లే రహదారిలోకి ప్రవేశించింది. పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢకొీంది. సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో ఉన్న సిసి కెమెరాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయింది.