ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని పెద్ద చెరువు అవుట్ ఫాల్ నుండి విస్తరించిన కాలువను ప్రక్షాళన దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఇంజనీరింగ్, ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ముందుగా లోవర్ ట్యాంక్ బండ్ రోడ్డు వద్దనున్న పెద్ద చెరువు అవుట్ ఫాల్ స్థితిగతులను పరిశీలించారు. అక్కడి నుండి ధర్మపురి వరకు ఉన్న కాలువ పరిస్థితిని గమనించారు. కాలువ ప్రాంతం మొత్తం చూసి, వర్షపు నీరు నిలవ లేకుండా సజావుగా ప్రవహించేందుకు చేపట్టాల్సిన చర్యలు గూర్చి సమాలోచనలు జరిపారు. కాలువ మొత్తం నిడివి 5 కిలోమీటర్లుగా గుర్తించి నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించేందుకు కాలువ విస్తరణకై ప్రాథమిక అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పద్మావతి నగర్ ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కొంతమంది టఔద్ధులకు ఆయనే స్వయంగా పింఛన్లను అందజేశారు. అనంతరం గుణుపూరు పేటలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. నాలుగు కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మించేందుకు సైట్ ప్లాన్ తయారుచేసి ఇవ్వవలసిందిగా టౌన్ సర్వేయర్, ప్లానింగ్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రమణమూర్తి, హరిబాబు, టౌన్ సర్వేయర్ సింహాచలం, డిఇలు శ్రీనివాసరావు, ప్రసాద్, ఎఇలు, ప్రజారోగ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
