కలెక్టర్‌ ఆదేశించినా వినరా?

Mar 18,2025 21:02

ప్రజాశక్తి – వేపాడ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది. ఆర్‌టిసి అధికారుల పనితీరు. ప్రభుత్వ విద్య బలోపేతానికి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ స్వయంగా జిల్లా కలెక్టర్‌ పలుమార్లు ఆదేశించినప్పటికీ ఆర్‌టిసి అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిందని, దీని వల్ల వేలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను విడిచి చదువులకు దూరమయ్యారని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో ఆరోపణలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ విద్య బలోపేతం కాకుండా ఇక్కడ ఆర్‌టిసి అధికారులే ఆటంకం కలిగించడం విస్మయానికి గురిచేస్తోంది.ఎస్‌కోట ఆర్‌టిసి డిపో నుంచి వయా సోంపురం, జాకేరు, కరకవలస (గిరిజన గ్రామాలైన మారిక, వెంకయ్యపాలెం, పోతు బండిపాలెం) చామలాపల్లి, దబ్బిరాజుపేట మీదుగా బక్కునాయుడుపేట ఏపీ ఆదర్శ పాఠశాలకు బడి బస్సు ఉంటే, ఈ పాఠశాలతో పాటు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కూడా విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ విద్య బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అందుకు ఒక ఆర్‌టిసి బస్సును ఈ రూట్లో నడపాలని 2022 సంవత్సరం నుంచి పలుమార్లు అర్జీలు పెడుతున్నప్పటికీ రూటు పరిశీలనకు వచ్చినప్పుడల్లా అధికారులు ఏదో ఒక కొత్త సమస్యను సాకు చూపి బస్సు నడపకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆర్‌టిసి అధికారులపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌ కోట డిపో మేనేజర్‌ స్పందిస్తూ ఈ విషయం తన పరిధిలో లేదని జిల్లా అధికారుల పరిధిలో ఉందని ఈ రూట్లో పెద్ద బస్సు తిరిగేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని మినీ బస్సు అయితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవని చెప్పారు. కానీ ఎస్‌కోట డిపోలో మినీ బస్సు లేదని దాటవేత ధోరణి ప్రదర్శించారు.జోనల్‌ చైర్మన్‌కు వినతి ఇక్కడ ఆర్‌టిసి అధికారుల దాటవేత ధోరణిపై ఆర్‌టిసి జోనల్‌ చైర్మన్‌ దొన్ను దొరకి వినతి పత్రాన్ని పంపించాను. ఈ గ్రామాలకు బస్సు కేటాయించాలని కోరాను. ఇప్పటికు మూడేళ్లుగా బడి బస్సు కోసం పోరాటం చేస్తున్నాను. ఎంతో మంది అధికారులను, చివరికి మంత్రి నారా లోకేష్‌ను కూడా కలిశాను. కలెక్టర్‌ ఆదేశించినా అధికారులు కొర్రీలు వేయడం బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి బడి బస్సును ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పడిపోయే ప్రమాదం ఉంది. రిక్కి అప్పారావు, సామాజిక కార్యకర్త, వేపాడఈ రూట్‌లో బడి బస్సు ప్రత్యేక అవసరంపేద ప్రజలు, గిరిజనులు ఎక్కువుగా ఉన్న ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా బడి బస్సు నడపడం ఎంతో అవసరం. సేఫ్టీ పేరుతో కాలయాపన చేయకుండా అత్యవసరంగా మినీ బస్సునైనా ఏర్పాటు చేయాలిజె. రాములమ్మ, తహశీల్దార్‌, వేపాడ.పాఠశాల మూతపడే అవకాశంప్రస్తుతం బక్కునాయుడుపేటలో ఉన్న జిఎంసి బాలయోగి పాఠశాల, కస్తూర్బా పాఠశాలలలో హాస్టల్స్‌ సౌకర్యం ఉంది. కానీ ఏపీ ఆదర్శ పాఠశాలలో హాస్టల్‌ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు వేరే ఇతర వాహనాల ద్వారా ఆదర్శ పాఠశాలకు రావాల్సిన పరిస్థితి. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. బడి బస్సు లేకుంటే రానున్న విద్యా సంవత్సరంలో ఏపీ ఆదర్శ పాఠశాలకు వచ్చే పిల్లలు సంఖ్య తగ్గి పాఠశాల మూతపడే ప్రమాదం ఉంది. రావాడ ఈశ్వరరావు, ప్రిన్సిపాల్‌, ఆదర్శ పాఠశాల, బక్కునాయుడుపేట

➡️