ప్రజాశక్తి-కొత్తవలస: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, రాష్ట్రానికి, జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గాడు అప్పారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మండలంలోని ఉత్తరాపల్లి రెవెన్యూ పరిధిలో దిబ్బచెరువులో, పాత సుంకరపాలెం చెరువులో కేంద్ర బడ్జెట్ ప్రతులను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలంతా దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు లేవని, ఉపాధి హామీనీ పట్టించుకోలేదని చెప్పారు. ఉపాధి హామీకి బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేశారు. రోజు కూలి రూ.600 ఇవ్వాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదిలో 200 రోజులు పని కల్పించాలని డిమాండ్‌చేశారు. మనిషికి ఒక జాబ్ కార్డు ఇవ్వాలని, ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ని రద్దు చేయాలని కోరారు. రెండు పూటల పని ఆపాలని, పని ప్రదేశాల్లో మౌలికసౌకర్యాలు కల్పించాలని, మేట్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు జీతం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో బండ రోజా, సబ్బవరపు భాగ్యలక్ష్మి, మల్లవరం రవణమ్మ, పి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట : బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ తెలిపారు. సోమవారం ఎస్.కోట ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి గాని, కార్మిక వర్గానికి గాని, రైతాంగానికి గాని అనుకూలంగా లేదన్నారు. ఇది కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ అన్నారు. ఈ కార్యక్రమంలో కె.రమేష్, ఎం.రాజు, వి.చరణ్, లక్ష్మి, షేక్ మదీనా, తదితరులు పాల్గొన్నారు.
