ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.497.96 కోట్ల జెడ్‌పి అంచనా బడ్జెట్‌ను జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ.496.35 కోట్ల బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలిపారు. చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా పరిషత్తు బడ్జెట్ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు, మంత్రులు డుమ్మాకొట్టారు. దీంతో పాలన, కార్యనిర్వహణ తరపున జిల్లాల కలెక్టర్లే సమాధానం చెప్పారు. సమావేశంలో అధికార పార్టీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినప్పటికీ చర్చ వాడీవేడిగా సాగడం గమనార్హం. ఒకానొక దశలో ‘అధికారులను బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదు. ఆరోపణలు చేసే ముందు సభ్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి, వేక్‌గా మాట్లాడటం సరికాదు..’ అంటూ సభ్యులను కలెక్టర్ హెచ్చరించారు. మరో శాఖపై చర్చ నడుస్తుండగా ‘అధికార పార్టీ తరపున కలెక్టర్ గారే మాట్లాడేస్తున్నారు..! అంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరికైనా కలెక్టర్‌గా చెప్పాల్సింది నేనే కదా..! అంటూ ఆయన చలోక్తులతో చురకలంటించారు.మెటీరియల్ కాంపొనెంట్ పనులు పంచాయతీల తీర్మానం లేకుండా చేస్తున్నారని, చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, అవినీతి జరుగుతోందని విజయనగరం ఎంపిపి మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. అధికారులకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? అంటూ ప్రశ్నించారు. దీనికి విజయనగరం కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ పనుల మంజూరు, చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ముద్ర వేయడం మంచిది కాదని, ఎక్కడైనా జరిగితే స్పష్టంగా, వివరంగా రాసి ఇస్తే విజిలెన్సు ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. సోషల్ ఆడిట్ పూర్తయిన చోట్ల 10 శాతం నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్.. డ్వామా పీడీకి సూచించారు. వికలాంగుల పింఛన్లను అనర్హుల పేరుతో తొలగిస్తున్నారనే భయాందోళన ప్రజల్లో ఉందని జిల్లా పరిషత్తు చైర్మన్ అన్నారు. వికలాంగుల పింఛన్లు తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎటువంటి ఉత్తర్వులూ ప్రభుత్వం నుంచి రాలేదని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తున్నామని, ఎటువంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. వెరిఫికేషన్ కోసం ప్రత్యేక వైద్యులతో 6 బృందాలను నియమించామని, రూ.15 వేల పింఛను పొందే వారి ఫొటో తీసి, అక్కడికక్కడే అప్‌లోడ్ చేస్తున్నారని వివరించారు. ఈ దశలో జెడ్‌పి చైర్మన్ స్పందిస్తూ పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ను కోరారు.వైద్య శాఖ సమీక్షలో భాగంగా హెచ్‌ఎంపివి వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందుతున్నారని సభ్యులు సమావేశంలో లేవనెత్తారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఆందోళన అవసరం లేదన్నారు. ఉద్యాన శాఖ సమీక్షలో భాగంగా జిల్లాలో మామిడి అధికంగా సాగులో ఉందని, ఎగుమతులు కూడా జరుగుతున్నాయని, మామిడి పంట ఇన్సూరెన్సు కోసం ఎకరానికి 2 వేల రూపాయలను ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ప్రీమియం తగ్గించాలని, బీమా గడువును కూడా పొడిగించాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపాలని సభ్యులు కోరారు. కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పరిశీలించి లేఖ రాస్తామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా జీడి మామిడి పంటకు హెక్టారుకు 4 వేల రూపాయలు ప్రీమియం ఉందని, దానిని తగ్గించాలని లేఖ రాసినట్లు మన్యం కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు.తాటిపూడి బోటు షికారు కోసం అన్ని రకాల అనుమతులు ఉన్నాయా, పర్యాటకుల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అని జిల్లా పరిషత్ చైర్మన్.. జలవనరులు, పర్యాటక శాఖల అధికారులను ప్రశ్నించారు. కలెక్టర్ స్పందిస్తూ అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, పర్యాటక కార్పొరేషన్, బోటు నడిపే కంపెనీ వారు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఇందులో భద్రత, ధర, ఇతర అంశాలపై చర్చించి బోటు నడపాలా? వద్దా? అనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, జెడ్‌పి సిఇఒ సత్యనారాయణ, రెండు జిల్లాలకు చెందిన అధికారులు, ఎంపిటిసి, జెడ్‌పిటిసి సభ్యులు పాల్గొన్నారు.
జలాశయాలకు మహనీయుల పేర్లు
తొలుత జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జలాశయాల నిర్మాణానికి కృషి చేసిన మహనీయుల పేర్లను పెట్టుకొని భావితరాలకు వారి సేవలను గుర్తుండేలా చేయడం గొప్ప విషయమని అన్నారు. ఆయా జలాశయాల వద్ద వారి విగ్రహాలను కూడా నిర్మించి పార్కులను ఏర్పాటు చేస్తే వారికీ సముచితమైన గుర్తింపునిచ్చినట్లు అవుతుందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరును, జంఝావతికి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పేరును, మడ్డువలసకు గొర్లె శ్రీరాములు నాయుడు పేరును, తాటిపూడి జలాశయానికి గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరును పెట్టడం జరిగిందన్నారు. ఆయా జలాశయాల వద్ద వారి విగ్రహాలను ఏర్పాటు చేసి, పార్కులను నిర్మించి సుందరంగా తీర్చిదిద్దాలని, నిధులు అవసరమైతే జిల్లా పరిషత్తు నుంచి సమకూరుస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను సమావేశం తీర్మానించింది.