ప్రజాశక్తి-విజయనగరం : తెలుగులో తొలి కావ్యం రచించిన రచయత్రి మొల్లమాంబయని, ఆమె చరిత్ర భావితరాల వారికి తెలియజేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రముఖుల్ని స్మరించుకునేటప్పుడు వారి ఘనతను మాత్రమే మాట్లాడుకోవాలని, వారి కులాన్ని బట్టి గౌరం ఇవ్వకూడదని తెలిపారు. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిని వెలిగించి, మొల్ల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల అనేక మంది ప్రముఖుల జయంతులు, వర్దంతులు జరుపుకుంటూ వారిని స్మరించుకోవడం జరుగుతోందని, ఇతువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భావితరాలకు గొప్పవారి గురించి తెలియజేసిన వారం అవుతామని అన్నారు. మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ 16వ శతాబ్దం లోనే 881 పద్యాలు 5 రోజుల్లో రాసిన మొల్లమాంబ రామాయణాన్నే కాకుండా కుల వివక్షపై అనేక పుస్తకాలు రాసారని పేర్కొన్నారు. శాలివాహన కులానికి చెందిన ప్రతినిధులు మొల్లమాంబ జీవిత చరిత్ర పై ప్రసంగించారు. సమావేశంలో ఇంఛార్జి జెసి డిఆర్‌ఒ శ్రీనివాస మూర్తి, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పెంటోజి రావు , డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, కొప్పళ వెలమ రాష్ట్ర డైరెక్టర్ కొల్లి అప్పల నాయుడు, బి.సి కార్పొరేషన్ అధికారులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.
