ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్రం రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని జిల్లా అభివద్ధిని వేగవంతం చేసి అభివద్ధి చెందిన జిల్లాగా రూపొందడానికి విలువైన సూచనలు అందజేశారు. జిల్లా ఏయే రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం వుందో గుర్తించి ఆయా రంగాల్లో గల అవకాశాలను ప్రస్తావిస్తూ దార్శనిక పత్రం రూపొందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మండల స్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి విజన్ ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ సదస్సులో ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు తెలియజేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి మరింత మెరుగైన రీతిలో నివేదిక రూపొందించి జిల్లా విజన్‌ను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తేనే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రమం ద్వారా పెద్ద ఎత్తున ఎగుమతులు చేయడానికి వీలుగా నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను రూపొందించడంపై దష్టి సారించాల్సి వుందన్నారు. చిన్నపరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం వుంటుందన్నారు. జిల్లాలో అందుబాటులో వున్న జలవనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా జిల్లాను అభివద్ధి బాట పట్టించవచ్చని ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా వేలాది ఎకరాల సాగుభూములకు నీటిని అందించడం, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అవసరమైన నీటిని సరఫరా చేయడం సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో విద్యార్ధుల అవసరాలకు తగినట్టుగా కళాశాలలు లేవని, వీటిని పెంచాల్సి వుందని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డిఆర్‌ఒ ఎస్.డి.అనిత తదితరులు పాల్గొన్నారు.రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో రోడ్లు తదితర మౌళికవసతులు కల్పించడం ముఖ్యమని చెప్పారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ నదుల అనుసంధానం ద్వారా జిల్లాలో సాగునీటిని అందించడంతో పాటు నగరానికి తాగునీటి కొరత కూడా తీర్చవచ్చని చెప్పారు. మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక శాతం మంది ఆధారపడివున్న వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాల్సి వుందని చెప్పారు.