ప్రజాశక్తి-చీపురుపల్లి: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఏర్పడిన అనిశ్చతను కూటమి ప్రభుత్వం తొలగించాలని కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి మహేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయస్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేంద్ర బాబు మాట్లాడుతూ ఆప్కాస్ రద్ధుచేస్తామని పత్రికల్లో వచ్చిన కథనాలపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన పడుతున్నారని అన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు ఆయా డిపార్ట్మెంట్లుకు అప్ప చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. ఆప్కాస్ రద్దు అనివార్యం అయితే, ప్రత్యామ్నాయ వ్యవస్థ అంతకంటే మెరుగైన వ్యవస్థ అయి ఉండాలని కోరారు. అలాగే సెర్ఫ్, మెప్మా సొసైటీ ఉద్యోగులకు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రవేట్ ఏజెన్సీలు (పాత విధానాన్ని) వల్ల గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
