జ్యూట్‌మిల్లును వెంటనే తెరిపించాలి

Oct 2,2024 21:25

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మహాత్మా మీరైనా స్థానిక జ్యూట్‌ మిల్‌ను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని జ్యూట్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కిల్లంపల్లి రామారావు కోరారు. బుధవారం జరజాపుపేట గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవ వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 4 నెలలుగా స్థానిక జ్యూట్‌మిల్‌ ముడి సరుకు కొరత పేరిట యాజమాన్యం మూసి వేసిందన్నారు. మిల్లు మూత బడడం వల్ల కార్మికులు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కి ప్రజా సంఘాల తరపున విన్నవించుకున్నప్పటిఈ నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి మూతబడిన జ్యూట్‌మిల్‌ను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కనకల పద్మనాభం, కార్మికులు గాడు అప్పారావు, హెచ్చర్ల అప్పారావు, తుమ్ము తాత, మద్దిల సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️