రాజులు చెరువు కబ్జా

May 24,2024 21:20

ప్రజాశక్తి-శృంగవరపుకోట : శృంగవరపుకోట పట్టణంలో పెద్ద వీధి నుంచి చింతావీధి వరకు, గాంధీనగర్‌ ప్రాంతాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాంతాలను ఆనుకుని రాజులుచెరువు ఉంది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ప్రాంతానికి ఆనుకొని ఉన్న చెరువు కావడంతో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఆక్రమణకు గురవుతూనే ఉంది. 28 ఎకరాల పైచిలుకు ఉండే ఈ చెరువుగర్భం నేడు 20 ఎకరాలు కూడా లేదు. ఈ చెరువు గర్భం ఎంత వేగంగా ఆక్రమణకు గురవుతుందో దీన్నిబట్టే అర్థమవుతుంది. శృంగవరపుకోట పట్టణంలోని రాజులుచెరువు కబ్జాల బారిన పడుతోంది. చెరువు గర్భం రోజురోజుకూ ఆక్రమణకు గురవుతూనే ఉంది. కబ్జాలు, అనుమతులు లేకుండా చెట్లు నరికివేయడంపై మండల, జిల్లా స్థాయి అధికారులకు రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలకు వెనుకాడుతున్నారు. దీంతో యథేచ్ఛగా ఆక్రమణలతోపాటు చెట్ల నరికివేత కొనసాగుతుందని స్థానిక రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజుల చెరువుకు చెందినదిగా రైతులు చెబుతున్న స్థలాన్ని చదును చేస్తూ, ఏపుగా పెరిగిన భారీ వృక్షాలను శుక్రవారం అనుమతులు లేకుండా జెసిబితో తొలగించి, కలపను ట్రాక్టర్‌తో కొందరు వ్యక్తులు రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకుని స్థలాన్ని చదును చేస్తున్న జెసిబిని అడ్డుకున్నారు. కలపతో రవాణాకు సిధ్ధంగా ఉన్న ట్రాక్టర్‌ను అడ్డగించి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గత తహశీల్దార్‌గా శ్రీనివాసరావు ఉన్న సమయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే రైతులు ఫిర్యాదుచేశారు. సర్వే నంబరు 462లో ఆక్రమణలు జరిగాయని, చెరువు గర్భాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి నోటీసులు ఇస్తామని ఆయన తెలిపారు. ఇంతలో ఆయన బదిలీపై వెళ్లిపోయారు. ఈసారి చెరువు స్థలాన్ని చదును చేయడమే కాకుండా అందులో కలపను తొలగించి, అక్రమంగా రవాణా చేస్తున్నారని, చెరువులోకి నీరు వచ్చే కాలువను కూడా పూడ్చివేశారని రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు హద్దులు నిర్ధారించి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఉపసర్పంచ్‌ మోపాడ కుమార్‌ ఆధ్వర్యంలో రైతులు ఎన్‌.సూరిబాబు, చంద్రశేఖర్‌ రావు, వసంత సత్యం, మోపాడ శ్రీను, చిప్పాడ శేషగిరిరావు, అప్పారావు, లక్ష్మి, ఈశ్వరమ్మ, సూర్యనారాయణ, జగదీష్‌, నాయుడు, ఎర్నాయుడు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.కఠిన చర్యలు తీసుకోవాలిచెరువు ఆక్రమణ, అనుమతులు లేకుండా చెట్లు నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా చెట్లు నరికితే, ఆ చెట్టు ఖరీదుకు రెండు నుంచి ఐదు రెట్లు సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జరిమానాగా కట్టాల్సి ఉంది. నీరు, గాలి, భూమి, చెట్టు (వాల్టా) చట్టాన్ని సక్రమంగా అమలు పరచడం ద్వారా పర్యావరణానికి హాని చేసే చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం కఠిన తీసుకోవాలి.- బొబ్బిలి రామకష్ణ, న్యాయవాది, శృంగవరపుకోట

➡️