పేదలకు నివాసమున్నచోట పట్టాలివ్వాలి

Mar 13,2025 20:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్‌ 30 ప్రకారం పూల్‌ బాగ్‌ పిజి కాలేజి ఎదురుగా 30ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లకు 2 సెంట్లు ఉచితంగా రెగ్యులర్‌ చేసి ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా గురువారం పూల్‌బాగ్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలు తెలిపారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ పేదల కోసం తెచ్చిన జీవోను పెద్దల ఉపయోగించు కోకుండా చూడాలని ఆయన కోరారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పక్కగా రెగ్యులర్‌ చేసి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాంధీ, ఆదిబాబు, తదితరులు పాల్గొన్నారు.
జీడి పంటకు మద్దతుధర ప్రకటించాలి
వేపాడ : జీడి పంట 80 కిలోల బస్తాకు రూ.16 వేలుగా మద్దతుధర నిర్ణయించి, ఐటిడిఎ, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు చల్లా జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గురువారం మండలంలోని కెజిపూడి, కరకవలస, జాకేరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. జీడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో జిసిసి ద్యారా జీడి పంట కొనేవారని, ఇప్పడు కొనుకోలు చేయకపోవడం వల్ల దళారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడికి ప్రభుత్వం మద్దతుధర ప్రకటించాలని డిమాండ్‌చేశారు. ఈ నెల 17న కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాకు జీడి రైతులు తరలిరావాలని కోరారు.

➡️