ప్రజాశక్తి- వేపాడ : వాహన ఫిట్నెస్, రెన్యువల్, రిజిస్ట్రేషన్ సేవలను ప్రయివేటీకరిస్తూ వేదాంత ప్రయివేటు ఫిట్నెస్ సెంటర్‌ను గరివిడి మండలం అచ్చుతాపురంలో ఏర్పాటు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు జిల్లా నాయకులు చల్లా జగన్ అన్నారు. మండలంలోని బొద్దాం, సోంపురం, వేపాడ ఆటో కార్మికులతో ఆయన ఆదివారం సమావేశమై ఈ నెల 10న నిర్వహించనున్న కలెక్టరేట్ వద్ద ధర్నా గురించి ప్రచారం చేశారు. అనంతరం గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ వేదాంతకి ఇచ్చిన ప్రయివేటు పిటినెస్ సెంటర్‌ను వెంటనే రద్దుచేసి ఆర్‌టిఒ అధికారులే సేవలందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లపై ఈ విధంగా ఆర్థిక దాడికి పాల్పడడం సరికాదన్నారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పద్మనాభం, రామారావు, శంకర్, వెంకటరావు, అప్పలకొండ, సత్తిబాబు, వెంకటసత్తి పాల్గొన్నారు.గజపతినగరం: అచ్చుతాపురంలోని ప్రయివేటు ఫిట్నెస్ సెంటర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఆటో, క్యాబ్, లారీ, వ్యాన్ తదితర మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ డ్రైవర్లందరూ పాల్గొనాలని శ్రీ మజ్జి గౌరమ్మ, శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కోమటిపల్లి, మానాపురం స్టాండ్ నాయకులు సిహెచ్ అప్పలనాయుడు ఉమామహేశ్వరరావులు కోరారు. ఈ రెండు స్టాండ్‌ల వద్ద ఆదివారం సమస్యలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాల రెన్యువల్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, లైసెన్స్ వంటి సేవలను ప్రయివేటీకరిస్తే ప్రమాదాలు మరింత పెరుగుతాయన్నారు. తక్షణమే పెంచిన ఫీజులు పెనాల్టీల జిఒ 21 రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
