ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : తెలుగువారు అత్యంత ఆనందంగా ఎదురుచూసే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని పల్లెలు బంధుమిత్రుల కోలాహలంతో సందడిగా మారాయి. ఏ ఇంటి ముంగిటి చూసినా రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతూ మహిళలు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆత్మీయులు, రక్త సంబంధీకులు పలకరింపులతో పల్లెటూళ్లలో కొత్త కొత్త వాతావరణం. సంక్రాంతి రోజున పూర్వీకులకు బట్టలు చూపిస్తూ, విస్తర్లలో బియ్యం, కూరగాయలు నింపి దానాలు, తర్పణాలు కొనసాగించారు. అనంతరం కొత్త బట్టలు ధరించిన యువతరం కోలాహలంగా వీధుల్లో తమ ఈడు వ్యక్తులను పలకరిస్తూ వారితో కలిసి మెలిసి తిరుగుతూ పాత ముచ్చట్లను గుర్తు చేసుకుని ఎంతగానో ఆనందించారు. ఒక్కసారిగా బంధుమిత్రుల రాకలతో రహదారులన్నీ కిక్కిరిసిపోతూ పండగ వాతావరణాన్ని రంజింపచేశాయి. ఇరుగు పొరుగు వారికి తాము చేసిన పిండి వంటలను పంపిణీ చేస్తూ మురిసిపోయే వాతావరణం కనిపించింది. దూరపు ప్రాంతాల్లో బతుకుతెరువు కోసం వెళ్లిన వలస జీవులు ఇళ్లకు చేరుకోవడంతో ఏ ఒక్క వీధిని చూసిన సందడి వాతావరణం కనిపించింది. యువత పండగను క్రీడల వైపు మళ్లించి పలు గ్రామాల్లో క్రికెట్, వాలీబాల్ పోటీలను నిర్వహించి, క్రీడా స్ఫూర్తిని కొనసాగించారు. బుధవారం కనుమ రోజు పశువులకు పసుపు, కుంకుమలు పూసి వాటికి పూజలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకొని అనంతరం మాంసాహార వంటలతో పండుగ రివాజును కొనసాగించారు. ఈ ఏడాది వరుస తుఫానులకు గురై ఎడతెరిపిలేని వానలను చూసిన గ్రామీణులు ఒక్కసారిగా వాతావరణం తేలికపడి, పొగ మంచు చలి వాతావరణంతో వేకువ ఝామున పల్లె అందాలు దిగుణీకృతం చేశాయి. ఏడాది మొత్తం ఎదురుచూసే సంక్రాంతి పండగ కళ్లముందే మూడు రోజులు కరిగిపోవడంతో భారంగా ముక్కనుమ నుండి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.వీరఘట్టం: మండలంలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్మి గ్రామంలో ముగ్గులు, పాటల పోటీలు, మ్యాజిక్కు ఛైర్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మోరు సినీ పాటుకు కొండపల్లి సిరి. ఉదయాన అనిల్ కుమార్ బృందానికి ప్రథమ బహుమతి లభించింది. ముగ్గుల పోటీలకు కొండపల్లి కళ్యాణికి ప్రథమ బహుమతి లభించింది. అదేవిధంగా జన విజ్ఞాన ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మహేశ్వర రావు మ్యాజిక్‌షో నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరమణమూర్తి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కొండపల్లి గౌరు నాయుడు,గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు. సీతానగరం: మండలంలోని బూర్జలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు బందు,మిత్రులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణ, పిల్లల ఆట పాటలతో కను విందు చేశారు. ప్రతి ఇంటా వేసిన రంగు రంగుల సంక్రాంతి ముగ్గులను తిలకించి సంస్కతి,సాంప్రదాయాలను ఇనుమడింప జేసిన ముగ్గులను కొనియాడి ప్రశంసించారు. రైతు వేష ధారణలో డాక్టర్ జగన్మోహన్ వ్యవసాయ ట్రాక్టర్‌ను గ్రామంలో నడిపి ఆకట్టుకున్నారు. బాల్య స్నేహితులతో గత స్మతులను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు. బూర్జ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ హేమాక్షి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
