పాఠశాల స్థలం అమ్మేవాడిని, కొనేవాడిని అరెస్టు చేయాలి

ప్రజాశక్తి-బొబ్బిలి : పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే సిబిఎం పాఠశాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా అమ్మినవారిపైన, కొనుగోలు చేసిన వారిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ పి.శంకరరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి రామ్.శ్రీనివాస్, ఇఫ్టూ నాయకులు ఎం.గోపాలం, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు. సిబిఎం పాఠశాల అక్రమ రిజిస్ట్రేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం వామపక్షాలు ఆధ్వర్యంలో పాఠశాల ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి, పరిసర ప్రాంతాలు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే సిబిఎం పాఠశాల స్థలాన్ని కరస్పాండెంట్ రత్నకుమార్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక అవినీతి జరిగిందని విమర్శించారు. రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు అక్రమాలకు పాల్పడి రిజిస్ట్రేషన్ చేశారని విమర్శించారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి పాఠశాల స్థలాన్ని అమ్మినవారిపైన, కొనుగోలు చేసిన వారిపైన కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలను ప్రస్తుతం ఉన్న భవనంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.లేనిచో పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎస్.గోపాలం, ఫాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు కె.అదృష్టకుమార్, తదితరులు పాల్గొన్నారు.

➡️