- ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్/ మెంటాడ : గిరిజన యూనివర్సిటీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీని కొత్తవలస వద్ద రెల్లి గ్రామానికి మారుస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను విరమించుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.శ్రీనివాస, ఉపాధ్యక్షులు కె.విజయగౌరి, గిరిజన సంఘం మన్యం జిల్లా కార్యదర్శి సీదిరి అప్పారావు తదితరులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్‌ను కలిసి పనులపై చర్చించారు. అనంతరం అజశర్మ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మంజూరైన గిరిజన యూనివర్సిటీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వర్సిటీ స్థలాన్ని మార్చడంతో నేటికీ మెంటాడ మండలం కుంటినివలస వద్ద నిర్మాణ ప్రారంభ దశలోనే ఉందన్నారు. నేడు మళ్లీ దీన్ని కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద గతంలో సేకరించిన స్థలంలోనే నిర్మిస్తామని ఈ నెల 13న రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారన్నారు. దీనివల్ల ఇది మరింత ఆలస్యం కావడం తప్ప మరొకటి కాదన్నారు. గత ప్రభుత్వం రెల్లి గ్రామం నుంచి కుంటినవలసకు మార్చిందని తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థలాలు మార్చడం సరికాదన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వర్సిటీని మార్చడం అవివేకమని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ తన నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కుంటినవలసలోనే వర్సిటీని నిర్మించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక లేఖలు రాసినట్లు తెలిపారు. వర్సిటీని యుద్ధ ప్రాతిపదికన 2025లోగా పూర్తి చేయాలని, శాశ్వత సిబ్బందిని నియమించి, అన్ని కోర్సులనూ అందుబాటులోకి తేవాలని, గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి టి. సోములు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాము, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాము, నాయకులు జగదీష్, రవికుమార్, కాంతారావు, గ్రామ సర్పంచి రమేష్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.