కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి

Mar 10,2025 21:23

ప్రజాశక్తి- డెంకాడ : గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు అధిక పని భారం, అధిక పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ వైభవానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటరావు, చింతపల్లి అప్పలనాయుడు మాట్లా డుతూ తాము 39 సర్వేలతోపాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటి ఒత్తిడితో పని భారం ఎక్కువై కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సచివాలయానికి వెళ్లిన దగ్గర నుంచి వివిధ రకాల సర్వేలతోనే సాయంత్రం వరకు సరిపోతుందని, గ్రామంలో వివిధ పనులపై వచ్చిన ప్రజలకు పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని సోమవారం ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశారు. కార్యదర్శులు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పన్ను వసూళ్లు, వ్యర్థ్యాల నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ వంటి విధులు నిర్వహిస్తూ, వీటితో బాటు పి4సర్వే, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కార్యదర్శులు లెంక తౌడు, కె.బంగార్రాజు, శ్రీదేవి, సుందరి, మహంతి వెంకటరావు పాల్గొన్నారు. పూసపాటిరేగ: పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలంటూ ఎంపిడిఒ రాధికకు సోమవారం వినతి పత్రం అందించారు. మండల పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షులు కె.ఎర్నినాయుడు ఆధ్వర్యంలో ఎంపిడిఒకు పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేశారు. సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న వివిధ సర్వేల పని భారం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.రామభద్రపురం: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పువ్వల పార్థసారధి ఆధ్వర్యంలో ఎంపిడిఒ రత్నంకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ అధిక పనిభారం కారణంగా కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు బొద్దూరు శ్రీనివాసరావు, శ్రావణ్‌ కుమార్‌, ఆకుల ప్రవీణ్‌ కుమార్‌, బాలకృష్ణ, పొట్టా బంగారు బాబు, శ్రీనివాసరావు, అడపా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️