రేపు వైసిపి ఫీజుపోరు

Feb 3,2025 19:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 5న ఫీజు పోరు పేరుతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించన్నుట్లు వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా ఫీజుపోరు గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్రైమాసికాలుగా బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.3,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే తనవైఖరి మార్చుకొని విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలు కూడా అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల ముందు సంపద సష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 5న జరిగే కలెక్టరేట్‌ ధర్నాకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా మంత్రి పత్రికలతో మాట్లాడుతూ మాట్లాడే ముందు గతంలో జరిగిన అభివద్ధి కార్యక్రమాలూ తెలుసుకొని మాట్లాడాలన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో వైసిపిది ప్రధాన పాత్ర అన్నారు. మంత్రిగా ఉండి జిల్లాకు రూపాయి నిధులు తెచ్చారా అని కొండపల్లి శ్రీనివాసరావును ప్రశ్నించారు. జిల్లాలో సమస్యలు పరిష్కారం చేసి మీ సమర్ధతను నిరూపించుకోవాలని మంత్రిని కోరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేసింది వైఎస్‌ ప్రభుత్వం అన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో పోలవరం ఎత్తు తగ్గించి ఉత్తరాంధ్రకు పోలవరం నీరు రాకుండా చేస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో గురజాడ నామజపం చేస్తూ ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ చేసి పోరాడుతామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అశపు వేణు, సూర్యనారాయణ రాజు, జై హింద్‌, బంగారునాయుడు, సత్యలత, భానుమూర్తి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️