భవనం ఇక్కడ.. విధులు అక్కడ

Jan 16,2025 20:25

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని నల్లబెల్లి గ్రామంలో సచివాలయం, వెల్నెస్‌ సెంటర్‌, రైతు భరోసా కేంద్రాలను గతేడాది మార్చిలో నిర్మించి ప్రారంభించారు. కానీ నేటి వరకూ ఆ భవనంలో విధులు మాత్రం నిర్వహించడం లేదు. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు పూర్తిస్థాయిలో బిల్లులు ఇవ్వకపోవడంతోనే విధులు అక్కడ నిర్వహించడంలేదన్న వాదన వినిపిస్తోంది. పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక ప్రస్తుత సిబ్బంది రైతు భరోసా కేంద్ర భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. రైతు భరోసా కేంద్రానికి, వెల్నెస్‌ సెంటర్‌కు, సచివాలయ భవనానికి గేట్లు కూడా లేవు. భవనం చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలతో నిండి ఉంది. గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయ భవనాలు అరకొర సౌకర్యాలు వల్ల సిబ్బంది విధులు నిర్వహించడానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని పూర్తిస్థాయిలో భవన నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు సిబ్బందికి ఉపయోగకరంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటే మంచిదని గ్రామ ప్రజలు కోరుతున్నారు.బిల్లులు చెల్లించకపోవడంతోనే..నేను ఈ మధ్యకాలంలో బాధ్యతలు తీసుకున్నాను. ఈ విషయం ఎంపిడిఒ, పిఆర్‌ జెఇ దృష్టికి తీసుకువెళ్లాను. అధికారులు వచ్చి పరిశీలన చేశారు. గ్రామంలో ఇరువర్గాల రాజకీయ నాయకుల వివాదాలతో పాటు కాంట్రాక్టర్‌ చేసిన పనులకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలో నిలిపివేశారు. బిల్లులు మంజూరు చేస్తే మిగిలిన పనులన్నీ చేయడానికి తనకు అభ్యంతరం లేదని కాంట్రాక్టర్‌ చెబుతున్నారని అన్నారు. రెండు రోజుల్లో భవనం చుట్టూ ఉన్న డొంకలను తొలగించి పరిశుభ్రం చేస్తాను.డిఎన్‌ నాయుడు,పంచాయతీ కార్యదర్శి నల్లబెల్లి

➡️