ప్రజాశక్తి- బొబ్బిలి : కంటికి వచ్చే వ్యాధుల్లో గ్లూకోమా ప్రమాదకరమైందని దానిపై అవగాహన పెంపొందించుకోవటం వల్ల నివారణ, నియంత్రణ సులభమౌతుందని బొబ్బిలి కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ కెవి అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక బొబ్బిలి కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ గ్లూకోమా వారోత్సవాల్లో భాగంగా గ్లూకోమాపై అవగాహన కార్యక్రమాన్ని రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ జెసి రాజు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ గ్లూకోమా వ్యాధి కంటి లోపల ఒత్తిడి పెరగటం వల్ల కంటి నరాలకు నష్టం కలిగే కంటి వ్యాధని దీన్ని నీటి కాసులు అని కూడా అంటారని అన్నారు. అధిక ఒత్తిడి కంటి వెనుక భాగంలో ఉండే ఆప్టిక్ నరంకి నష్టం కలిగిస్తుందని, ప్రారంభ దశలో పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికి క్రమంగా కంటిచూపు సన్నబారి చివరకు అంధత్వం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇది వంశపారం పర్యంగా వస్తుందని, ప్రతి 6 నెలలకు ఒకసారి గ్లూకోమా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ జెసి రాజు మాట్లాడుతూ గ్లూకోమాను అదుపు చేయటానికి చుక్కల మందులు, శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అభివీక్ సంస్థ ప్రతినిధులు నక్షత్ర, శ్రీనివాస అయ్యప్పన్, శ్రీనివాస్ లు గ్లూకోమా వ్యాధి, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. అనంతరం రోటరీ సభ్యులు శ్రీహరి, గేంబలి శ్రీనివాసరావు, కృష్ణ మోహన్, శ్రీనివాసరావులు డాక్టర్ అప్పారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
