ప్రజాశక్తి – జామి: ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా ఉంది… జామి పంచాయతీ అధికారుల తీరు. రోజువారీ మార్కెట్‌ను పంచాయతీ వేలం వేసిన ప్రతిసారీ… మార్కెట్ స్థలం మార్చేస్తామని చెప్పి, వేలం వేసి, ఆ తర్వాత రోడ్డుపైనే వదిలేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది కూడా అధికారులు అదే చేశారు. నెల రోజుల్లో మార్కెట్ స్థలం మార్చేస్తామని చెప్పారు. కానీ వేలం వేసి ఏడు నెలలు గడిచినా, రోడ్డుపైనే మార్కెట్ నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తున్న రోజువారీ మార్కెట్‌తో ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతుండటమే అందుకు నిదర్శనం. ఇంతకీ మార్కెట్ కష్టాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..!జామి మేజరు పంచాయతీ రోజువారీ మార్కెట్ నిర్వహణ ఏళ్లుగా వివాదాస్పదంగా నడుస్తోంది. గతంలో గ్రామంలో వారపు సంత కేంద్రంగా మార్కెట్ నిర్వహణ సాగేది. గతం కంటే రైతులు పెద్దఎత్తున కూరగాయల సాగు విస్తృతం చేశారు. దీంతో జిల్లాలో రామభద్రపురం తర్వాత ఎక్కువగా కూరగాయలు పండించే ప్రాంతంగా జామి ఉంది. పండించిన పంట అమ్ముకోవడానికి సరైన మార్కెట్ అవసరం. ఈ నేపథ్యంలోనే జామి మండల కేంద్రంలో ప్రతిరోజూ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణకు పంచాయతీకి లక్షల్లోనే ఆదాయం సమకూరుతోంది. కానీ మార్కెట్ నిర్వహణకు సరైన స్థలం ఏర్పాటు చేయడంలో పంచాయతీ ఏళ్లుగా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారిపై నడుస్తోన్న మార్కెట్‌తో వాహన చోదకులకు, అత్యవసర పనులపై వెళ్ళిన ప్రజానీకాన్ని ట్రాఫిక్ అంతరాయం ముప్పు తిప్పలు పెడుతోంది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర చికిత్సలు అందాల్సిన రోగులతో 108 వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకొని నిలిచిపోతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలు మార్కెట్‌ను దాటాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కష్టపడి పండించిన కూరగాయలు అమ్ము కోవడానికి రైతులు, రహదారి గుండా ప్రయాణం చేయాల్సిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటా మార్కెట్ ద్వారా రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్న పంచాయతీ అధికారులు, పాలక వర్గం మాత్రం మార్కెట్ నిర్వహణకు సురక్షితమైన స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉందని ప్రజల ఆరోపణ. ఇప్పటికే అనేక మార్లు మార్కెట్ వ్యవహారంపై పంచాయతీకి ఫిర్యాదులు అందాయి. పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. కానీ పాలకుల్లో మాత్రం ఇసుమంతైనా చలనం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏళ్లుగా తాత్సారంగతంలో ‘ప్రజాశక్తి’ పలు మార్లు మార్కెట్ నిర్వహణకు స్థలం కేటాయించాలని కథనాలు ప్రచురించింది. దీంతో గతంలో మండల పెద్దల చొరవతో వారపు సంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, మార్కెట్‌కు శాశ్వత పరిష్కరం చూపేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఏళ్లు గడుస్తున్నా.. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఆ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రోజువారి మార్కెట్ నిర్వహణకు అటు రైతులకు, ఇటు ప్రజలకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. సంత అభివృద్ధి చేస్తున్నాంగ్రామంలోని వారపు సంత ప్రాంతాన్ని అభివద్ధి చేస్తున్నాం. ఇప్పటికే ప్రహరీ నిర్మించాం. కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, రోజువారి మార్కెట్‌ను అక్కడకు తరలించాలని చూస్తున్నాం. త్వరలోనే మార్కెట్ నిర్వహణ సమస్య పరిష్కారం అవుతుంది.- శ్రీదేవి, ఇఒపిఆర్‌డి, జామి
