ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడినవారికి ఒకొక్కకిరికీ అధికార పార్టీ (టిడిపి) నామినేటెడ్ పదవులు కల్పిస్తోంది. కానీ, సీటు కోసం ఎందాకైనా రెడీ అన్నట్టుగా వ్యవహరించి, చివరకు అధిష్టానం ఒత్తిడి, స్పష్టమైన హామీలతో వెనక్కి తగ్గిన టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, అ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణకు మాత్రం ఇప్పటి వరకు పదవులు దక్కలేదు. జిల్లా పార్టీలో అత్యంత కీలకంగా వున్న ఈ ఇద్దరూ కక్కలేక మింగలేక అన్నట్టుగా లోలోప మదనపడుతున్నారని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి గడిచిన ఎన్నికలకు ముందు నుంచే వీరిద్దరూ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. ముఖ్యంగా నాగార్జున జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూనే చీపురుపల్లిలో చురుకైన పాత్ర పోషించారు. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శక్తిమేర పనిచేయడంతో గత ఎన్నికల్లో సీటు ఆయనకు ఖాయం అనే వాతావరణం కూడా కనిపించింది. చివరకు చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోసం నాగార్జునను పక్కనబెట్టారు. అప్పట్లో తీవ్ర నిరాశ, మనస్థాపం చెందిన ‘నాగార్జున యువత రాజకీయాల్లోకి రావొద్దు’ అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. ఆయనకు సీటు ఇవ్వాలంటూ చీపురుపల్లిలో భారీ ర్యాలీలు కూడా జరిగాయి. చివరకు పార్టీ నేత లోకేష్ జోక్యంతో నాగార్జున ఒక్క అడుగు వెనక్కితగ్గి పార్టీ అధ్యక్షునిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు ఎస్.కోట టిక్కెట్ ఆశించిన గొంప కృష్ణ సీటు దక్కకపోవడంతో ఏకంగా స్వతంత్రంగా పోటీచేసేందుకు కూడా సిద్ధం అయ్యారు. ఇందుకనుగుణంగా భారీ భహిరంగ సభసైతం నిర్వహించడంతో అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగించింది. అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామంటూ అధినేత చంద్రబాబు సహా లోకేష్ కూడా హామీ ఇచ్చారు. దీంతో, వెనక్కి తగ్గడంమే కాకుండా విశాఖ ఎంపీ భరత్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను బట్టి పార్టీ గెలుపునకు కృషి చేశారనడంలో సందేహం లేదు. వీరితోపాటు నెల్లిమర్ల నియోజకవర్గంలో సీటు ఆశించిన కర్రోతు బంగార్రాజుకు కొన్నాళ్ల క్రితం మార్కెఫ్‌డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించినప్పటికీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. తాజాగా గ్రీష్మకు ఎమ్మెల్సీ సీటు ప్రకటించడంతో తనకు రాలేదన్న నిరాశతో బంగార్రాజు ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సంగతి కాస్త అటుంచితే, నాగార్జున, కృష్ణలకు ఇప్పటికీ పదవులు కట్టబెట్టకపోవడంతో జిల్లాలో సర్వత్రా చర్చనడుస్తోంది. ఎమ్మెల్సీ పదవులకు మించిన పదవులు ఇంకేముంటాయంటూ వారి అనుయాయుల నోట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని అధిష్టానం పట్టించుకోవడం లేదని కొందరు అంటుంటే, సముచితమైన పదువులు ఇచ్చే ఆలోచనలో భాగంగానే సందర్భం కోసం పార్టీ ఎదురు చూస్తోందని మరికొందరు వాదిస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్లు ఎలాగూ భర్తీ అయిపోతున్నాయి కాబట్టి త్వరలో అధిష్టానం ప్రకటించిన నామినేటెడ్ పదువులైనా వస్తాయన్న ఆశతో నాగార్జున, గొంపకృష్ణ ఎదురు చూస్తున్నారు. టిడిపి అధిష్టానం వీరి ఆశలను తుంచుతుందో, నెరవేరుస్తుందో వేచి చూడాల్సిందే.
