టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

Mar 9,2025 21:19

ప్రజాశక్తి – బొబ్బిలి : టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. పట్టణ పేదల కోసం రామన్నదొరవలస సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఆదివారం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇళ్లు లేని పేదల కోసం గత టిడిపి హయాంలో టిడ్కో ఇళ్లను మంజూరు చేసిందని, అప్పటిలో నిర్మాణాలు పూర్తి చేయలేదని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. లబ్ధిదారులతో డబ్బులు కట్టించుకుని బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇల్లు అప్పగించకుండానే బ్యాంకర్లు లబ్ధిదారులకు లోన్‌ చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. 1680 ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన పాలకులు నిర్మాణాలు పూర్తి చేయకపోవడం అన్యాయమన్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవన్నారు. తక్షణమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ ఎస్‌.గోపాలం, నాయకులు జి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.కొత్తవలసలో ప్రజా చైతన్య యాత్ర కొత్తవలస: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పాత సిమెంట్‌ రోడ్డులో ఆయన పర్యటించారు. ఇంటిటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయని చెప్పారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి పరిష్కారమయ్యే విధంగా చొరవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణ, ఈశ్వరమ్మ, అప్పలరాజు, రమణమ్మ, లక్ష్మి, అనురాధ, ఉమా, పాల్గొన్నారు.

➡️