ముందుకు సాగని ఇళ్లు

Jun 8,2024 21:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల అష్టకష్టాలు పడుతున్నారు. నిర్మాణ వ్యయం పెరగడం, కాలనీల్లో సరైన సౌకర్యాల లేమితో ఇళ్ల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. విజయనగరానికి చెందిన గుంకలాం లేఅవుట్‌లో ఇళ్లు మంజూరై మూడేళ్లు దాటినా నేటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. గుంకలం లేఅవుట్‌లో తొలి విడతలో సుమారు 13 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఈ మొత్తంలో ఒక్కొక్క సిమెంట్‌ బస్తా రూ.267 చొప్పున రూ.24 వేలు విలువ చేసే 90 సిమెంట్‌ కట్టలు, రూ. 35 వేలు ఖరీదు చేసే 495 కిలోల స్టీల్‌ అందిస్తారు. మిగిలిన మొత్తం నాలుగు విడతల్లో నిర్మాణ దశలను బట్టి గృహ నిర్మాణ శాఖ అధికారులు మంజూరు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం సిమెంట్‌, ఇసుక తప్ప ఐరెన్‌ ఇవ్వడం లేదు. నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, కాలనీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీనికితోడు ఎన్నికల ముందు వరకు అధికారులు నిర్మాణాల్ని పూర్తి చేయాలని ఒత్తిడి తేవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోక పోవడంతో తమపై భారం పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్‌ బస్తా రూ.400, ఇనుము టన్ను రూ.75 వేల వరకు ఉందని వాపోతున్నారు. కొంతమంది లబ్ధిదారులకు మొన్నటి వరకు నిర్మాణాలు ప్రారంభిద్దామని ముందుకొచ్చినా, పునాదుల వరకు వేసి వదిలిపెట్టిన వారు ఎక్కువమంది ఉన్నారు. సుమారుగా మూడు వేల మందికి పైగా లబ్దిదారులు పునాదులు వేసి విడిచి పెట్టారు. దాదాపు రెండు వేల ఇళ్ల గోడల వరకు కట్టి వదిలేశారు. పునాది, గోడలు కట్టేటప్పటికి రూ.5 లక్షలు వరకు ఖర్చు కావడం, మిగిలిన పని చేసేందుకు మరో ఐదారు లక్షలు వ్యం అవుతుండటంతో ఆర్థిక స్థోమత లేక మధ్యలో ఆపేశారు. సుమారుగా 9 వేల వరకు లబ్ధిదారులు కనీసం పునాదులు కూడా తీయలేదు. ఈ కాలనీలో కాలువలు లేవు. నిర్మాణానికి నీటి సరఫరా లేదు. నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసి లేఅవుట్‌లోకి తీసుకెళ్లేందుకు ఖర్చు భారంగా ఉండటంతో లబ్ధిదారులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. నూతనంగా వచ్చిన టిడిపి ప్రభుత్వమైనా నిర్మాణాలు పూర్తి చేస్తుందో? లేదో వేచి చూడాల్సిందే.

➡️