నిర్మాణాలు సాగని జగనన్న కాలనీ

Jun 8,2024 16:49 #Vizianagaram

నిర్మాణ సమస్యలతో లబ్ధిదారులకు కష్టాలు
కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేస్తుందా..!
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల అష్టకష్టాలు పడుతున్నారు. నిర్మాణ వ్యయం పెరగటం, కాలనీల్లో సరైన సౌకర్యాల లేమితో విజయనగరానికి చెందిన గుంకలాం లే అవుట్ పరిధిలోని పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇల్లు మంజూరు అయి మూడేళ్ల దాటినా నేటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గుంకలం లే అవుట్ పేదలకు తొలి విడత 13000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఈ మొత్తంలో ఒక్కొక్క సిమెంట్‌ కట్ట రూ. 267ల చొప్పున రూ.24 వేలు విలువ చేసే 90 సిమెంట్‌ కట్టలు, రూ. 35 వేలు ఖరీదు చేసే 495 కేజీల స్టీల్ అందిస్తారు. మిగిలిన మొత్తం నాలుగు విడతల్లో నిర్మాణ దశలను బట్టి గృహ నిర్మాణ శాఖ అధికారులు మంజూరు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం సిమెంట్, ఇసుక తప్ప ఐరెన్ ఇవ్వడం లేదు.
నిర్మాణ వ్యయం భారీగా పెరగటం, కాలనీల్లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో పనులు ముందుకు సాగడం లేదు. దానికి తోడు అధికారులు నిర్మాణాల్ని పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోకపోవటంతో తమపై భారం పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్​లో సిమెంట్‌ కట్ట రూ. 400, ఇనుము టన్ను రూ. 75 వేలు వరకు ఉందని వాపోతున్నారు. దీంతో కొంతమంది లబ్ధిదారులకు మొన్నటి వరకు నిర్మాణాలు ప్రరంబిద్దామని ముందుకు వచ్చి పునాదులు వరకు వేసి వదిలిపెట్టిన వారు ఎక్కువమంది ఉన్నారు. సుమారుగా మూడు వేలకు పైగా లబ్దిదారులు పునాదులు వేసి విడిచి పెట్టారు.మరి కొంతమంది గోడలు వరకు కట్టి సుమారుగా 2000 పైగా లబ్దిదారులు కట్టి వదిలేశారు. పునాది,గోడలు కట్టేటప్పటికి 5లక్షలు వరకు ఖర్చు కావడంతో మిగిలిన పని చేసేందుకు 8 నుంచి 10 లక్షలు అవుతుండటంతో ఆర్ధిక స్తోమత లేనందువలన మధ్యలోఆపేశారు. సుమారుగా 9వేలు వరకు లబ్దిదారులు కనీసం పునాదులు కూడా వెయ్యలేదు. మరో వైపు కాలువలు లేవు, నిర్మాణానికి, నీటి సరఫరా లేదు,నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసి లే అవుట్ లోకి తీసుకెళ్లేందుకు అధిక మొత్తం ఖర్చు బారంగా ఉండటంతో ముందుకు వచ్చే పరిస్తితి కనిపించడం లేదు. దీంతో నిర్మాణాలు ముందుకు సాగని పరిస్తితి నెలకొంది. నూతనంగా వచ్చిన తెలుగుదేశం ప్రభుతమైన నిర్మాణాలు పూర్తి చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

➡️