ఓటు వినియోగంలో పట్టణాల్లో పెరగని ఆసక్తి

May 16,2024 20:14

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పాలకపార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై నమ్మకం సడలుతోందో లేక రాజకీయాలపైనే ఆసక్తి తగ్గిపోతోందో… ప్రభుత్వ పథకాలు రుచించడం లేదో.. కారణమేదైనా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల ఆసక్తి తగ్గింది. సార్వత్రిక ఎన్నికల్లో విద్యలకు నిలయంగావున్న విజయనగరంలో ఓటింగ్‌ శాతం పెరగకపోవడం, ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా నమోదు కావడం ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లాలోని ఏడు, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో విజయనగరం నియోజకవర్గంలో అత్యల్పంగా 71.84శాతం ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇదే నియోజకవర్గంలో 2014లో 71.71.28శాతం, 2019లో 70.81శాతం ఓట్లు నమోదయ్యాయి. దీన్నిబట్టి విజయనగరంలో ఓటింగ్‌ పెద్దగా పెరుగుదల లేదన్నది అర్థమౌతోంది. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తంగా 2,67,205 మంది ఓటర్లు ఉండగా కేవలం 1,84,787మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 89,886 మంది కాగా, మహిళలు 94,894 మంది ఉన్నారు. మరో ఏడుగురు థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. దీన్నిబట్టి ఓటర్ల సంఖ్యలోనూ, ఓటు హక్కు వినియోగించుకున్నవారిలోనూ పురుషులకన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారన్నది కూడా స్పష్టమౌతోంది. ఇదే నియోజకవర్గానికి ఆనుకునివున్న నెల్లిమర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 88.25శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. ఇక్కడ తొలి నుంచీ ఓటర్ల చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ 2019లో 87.81శాతం, 71.28శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈయా ఎన్నికల్లో సగటు నియోజకవర్గ ఓటరు సరళిని పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలోనే అత్యధికం శాతం ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 2,13,551 మంది ఓటర్లకుగాను 1,88,456 ఓట్లు మొదయ్యాయి. ఇక్కడ వలసఓటర్లను సమీకరించడంలో ఇటు వైసిపి, అటు టిడిపి విజయవంతమయ్యాయి. విజయనగరంలో ఆ విధమైన ప్రయత్నం తక్కువగా ఉంది. కాస్త ఎగువ మధ్యతరగతి వాసులు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. రెండు పార్టీల మేనిఫెస్టోల్లో కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఉండడం, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించినవేమీ లేకపోవడం, పన్నుల భారం తదితర అంశాలు విజయనగరంలో పోలింగ్‌ శాతం పెరగకపోవడడానికి కారణమై ఉంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నవారిలో మాత్రం విజయనగరం నియోజకవర్గవాసులే ఎక్కువ మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 18,869 పోస్ట్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు కాగా, ఇక్కడ అత్యధికంగా 4,201ఓట్లు నమోదయ్యాయి. అయినప్పటికీ మొత్తంగా పరిశీలించినప్పుడు విజయనగరంలో పాలకొండ, సాలూరు, కురుపాం వంటి గిరిజన ప్రాంత నియోజకవర్గాలకన్నా ఓటింగ్‌ శాతం తక్కువగానే నమోదైంది. విజయనగరంలోని ఏడు నియోజకవర్గాల్లో విజయనగరం కన్నా కాస్తంత ఎక్కువగా 76శాతం ఓట్లు నమోదు కాగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ 80శాతం పైబడి ఓటింగ్‌ శాతం నమోదైంది.

➡️