ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని వెంకంపేట-మీసాల డోలపేట పరిధిలో ఉన్న వ్యవసాయ భూములలో చేపల చెరువులు ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని మత్య్స శాఖ అసిస్టెంట్ తనిఖీ అధికారి ప్రసాద్ రావుకు బుధవారం రైతులు విన్నవించారు. మంగళవారం వెంకంపేట గ్రామ రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందించిన విషయాన్ని ప్రజాశక్తిలో చేపల చెరువులకు అనుమతులు ఇవ్వద్దు అనే కథనానికి మత్స్య శాఖ జిల్లా అధికారులు స్పందించారు. తక్షణమే గ్రామాన్ని సందర్శించి నివేదికలు అందించాలని రాజాం క్లస్టర్ మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి ప్రసాద్ రావుకు ఆదేశించారు. దీంతో ప్రసాదరావు గ్రామానికి చేరుకొని సచివాలయంలో రైతులను పిలిచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో వెళ్లి పరిశీలించారు. ఈ ప్రాంతంలో 20 ఎకరాలకు సంబంధించి చేపల చెరువులు ఏర్పాటుకు మాజీ సర్పంచ్ ప్రయత్నిస్తున్నాడని వివరించారు. రైతులు, చేపల చెరువులు తయారు చేసే యజమానులను పిలిపించినప్పటికీ రైతులు మాత్రమే సచివాలయం కొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారని మత్స్యశాఖ అధికారి తెలిపారు. చేపల చెరువుల తవ్వకాలకు గ్రామపంచాయతీ తీర్మానం అవసరమని చెప్పారు. అనుమతులు లేకుండా చేపల చెరువులకు తవ్వకాలు చేపడితే తక్షణమే చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
