నిబంధనలకు విరుద్ధంగా కేటాయిస్తే ఆందోళన చేస్తాం

Mar 10,2025 21:19

ప్రజాశక్తి – భోగాపురం: నిబంధనలకు విరుద్ధంగా చెరుకుపల్లి కొండను ఎవరికైనా కేటాయిస్తే ఆందోళనకు దిగుతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. మండలంలో వివాదాస్పదమైన 100 కోట్ల విలువైన చెరుకుపల్లి కొండను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. మాజీ సైనికుల పేరుతో 100 కోట్ల విలువైన చెరుకుపల్లి రెవెన్యూలోని కొండని ఏకంగా నలుగురు మాజీ సైనికులకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని అన్నారు. ఇక్కడ 20 ఎకరాల పేరుతో మరో 40 ఎకరాలకు పాగా వేశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా మాజీ సైనికులకు కేటాయించారని అప్పటి కలెక్టర్‌ సూర్యకుమారి ఈ కొండను ప్రభుత్వ భూమి కింద మార్చి లావాదేవీలు జరగకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇటీవలి కొంతమంది వ్యక్తులు వచ్చి ఎటువంటి అనుమతులూ లేకుండా కొండను చదును చేసే పనులు ప్రారంభించడం చాలా దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నామని తెలిపారు. కొండపైకి వేసిన రహదారిని కూడా మూసివేయాలన్నారు. అంతకుముందు ఈ కొండను అన్యాక్రాంతం చేయకుండా కాపాడాలని, ఎవరైనా వ్యక్తులు వచ్చి ఇక్కడ పనులు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ ఎం సురేష్‌కు వినతి పత్రం అందజేశారు.స్థానికులతో కలిసి కొండ పరిశీలన స్థానికులతో కలిసి చెరుకుపల్లి రెవెన్యూలోని కొండను సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ కొండను నిబంధనలు విరుద్ధంగా కేటాయింపులు చేసి జిరాయితి భూమిగా గతంలో మార్చేశారని అదే గ్రామానికి చెందిన సరగడ తోగులు రెడ్డి, గంటా నరసింగరావు తెలిపారు. కానీ ఇటీవలి కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులూ లేకుండా ట్రాక్టర్‌తో చదును పనులు చేయడంతో తామే అడ్డుకున్నామని వివరించారు. తమ కొండను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు కేటాయించేందుకు ఒప్పుకోమన్నారు. ఎవరికైనా కేటాయిస్తే సిపిఎం పార్టీ తరపున పూర్తి సహకారం మీకు అందిస్తామని సూర్యనారాయణ వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట సిపిఎం నాయకులు టీవీ రమణ, బచ్చల సూర్యనారాయణ ఉన్నారు.

➡️