వంద రోజుల్లోనే ప్రగతి సాధించాం

Oct 3,2024 21:21

ప్రజాశక్తి- విజయనగరం కోట : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే ప్రగతి సాధించిందని విజయనగరం టిడిపి పార్లమెంటు స్థానం అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. గురువారం అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మూడు హామీలను నెరవేర్చిందన్నారు. వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందని చెబుతున్న వైసిపి నాయకులు తమ హయాంలో వంద రోజుల్లో ఏం చేశారో ఆలోచించాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలలో పెన్షన్‌ మొత్తం పెంచారన్నారు. టిడిపి ప్రభుత్వం పేదల కోసం ఐదు రూపాయలకే భోజనాలను అన్నా క్యాంటీన్‌ ద్వారా ఏర్పాటు చేస్తే దానిని మీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూసివేశారని, వాటిని తిరిగి తెరిపించామని తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా చేపట్టడమే కూటమి లక్ష్యమన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, గ్రంథాలయం మాజీ చైర్మన్‌ రొంగలి పోతన్న, వి.ప్రసాద్‌, చంద్రశేఖర్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️