ప్రజాశక్తి- రాజాం : భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు వెంటనే ప్రారంభించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు కోరారు. ఇందులో భాగంగా అక్టోబర్ ఒకటిన లేబర్ ఆఫీసు వద్ద నిర్వహించనున్న ధర్నా జయప్రదం చేయాలని రాజాంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచంలో మట్టి పోసినట్లుగా అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకు అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం ఆపేసిందన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేసి ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి వెంటనే సంక్షేమ పథకాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు రాజాం ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి ప్రదర్శన లేబర్ ఆఫీసు వద్ద ధర్నా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఏ జగన్మోహన్‌రావు, సిఐటియు రాజాం నియోజకవర్గం నాయకులు పోరెడ్డి విశ్వనాథం, మడపాన త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.