ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : మున్సిపల్ పరిధిలో ఇళ్లులేని నిరుపేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల పంపిణీ కోసం సంబంధిత లబ్దిదారులు ఏడేళ్లుగా కళ్లు కాయలు కాచి ఎదురు చూపులు చూసినప్పటికీ ఇళ్లు మాత్రం వారి చేతికి రాలేదు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ పంపిణీ జరిగేది ఎప్పుడో అని లబ్ధిదారులు వాపోతున్నారు. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత ఇళ్లు లేని పేదలకు షేర్ వాల్ టెక్నాలజీతో టిట్కో ఇళ్లను సబ్సిడీతో బ్యాంకు లోన్ ద్వారా కట్టించి ఇస్తామని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మున్సిపాలిటీ పరిధిలోని 1488 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, కేటగిరి-1 లో 300 చదరపు అడుగులకు రూ.500, కేటగిరి-2 లో 365 చదరపు అడుగులకు రూ.50వేలును రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా చెల్లించేందుకు, కేటగిరి-3 లో 430 చదరపు అడుగులకు లక్ష రూపాయలను రూ.25 వేలు చొప్పున నాలుగు దఫాలుగా చెల్లించేందుకు కమిషనర్ పేరు మీద బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు డి డి ల రూపంలో చెల్లించారు. అయితే రెండేళ్లయినా ఆ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టును రద్దుచేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. అయితే వైసిపి ప్రభుత్వం హయాంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఎంపికైన 1488 మంది లబ్ధిదారులను కుదించి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ఇళ్లులేని 768 మంది లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల ఇళ్లను ఒక్క రూపాయికి ఇచ్చేందుకు పార్వతీపురం మండలం అడ్డాపుశిల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో 16 బ్లాకుల్లో టిడ్కో గృహ సముదాయాలను నిర్మించారు. లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పనులు కూడా కొంత స్థాయిలో పూర్తయ్యాయి. కానీ, ఈ గృహ సముదాయాలకు కావాల్సిన తాగునీరు, రోడ్లు, కాలువలు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు పూర్తి కాలేదు. ఎన్నికలకు ముందు ఆ పనులను త్వరగా పూర్తి చేసి పంపిణీ చేసేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పాటు కాంట్రాక్టర్‌కు బిల్లులు బకాయి ఉండడంతో పనులు జరగలేదు. ఈ మున్సిపాలిటీకి చెందిన వైసిపి సీనియర్ నాయకులు జమ్మాన ప్రసన్న కుమార్‌కు వైసీపీ ప్రభుత్వ హయాంలో టిట్కో చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఈ ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో చొరవ చూపలేదనే విమర్శలు లబ్ధిదారుల నుండి వెళ్లివెత్తాయి. ఐదేళ్లు పూర్తయిన కూడా వైసీపీ ప్రభుత్వము టిట్కో ఇళ్లను అసంపూర్తిగా పూర్తిచేసి రంగులు వేశారే తప్ప లబ్ధిదారులకు అందించడానికి కృషి చేయలేదనే విమర్శలు వినిపించాయి.అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు కావస్తున్నప్పటికీ టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇళ్లు ఎప్పుడు తమకు చేరుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర టిడ్కో ఇళ్లను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ ఇళ్ల కోసం బ్యాంకులో డిడి రూపంలో లక్షలాది రూపాయల చెల్లించిన మిగతా బాధిత లబ్దిదారులకు నగదును ప్రభుత్వం నుంచి తిరిగి ఇచ్చేందుకు కృషి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇల్లు లేదు… డబ్బులు ఇవ్వరు..
ఏడేళ్ల క్రితం టిట్కో ఇంటి కోసం డబ్బులు చెల్లిస్తే ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. సరికదా, డబ్బులు కూడా మున్సిపల్ అధికారులు చెల్లించలేదు. తాను ఒక ప్రైవేటు పాఠశాలలో చిరు ఉద్యోగిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. సొంత ఇంటి కోసం ఆశపడి అప్పులు చేసి బ్యాంకులో డిడి చెల్లించాలంటే అప్పు చేసి కట్టారు. అప్పు చేసి డబ్బుకు వడ్డీ చెల్లిస్తున్నాను. డబ్బులు చెల్లించాలని పలుమార్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ అధికారులు స్పందించ లేదు. – సోమేష్ , ప్రైవేట్ ఉద్యోగి
