ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 30 ఏళ్లుగా పిఇటిలుగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు బదిలీల్లో అన్యాయం జరుగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బదిలీల్లో సమన్యాయం పాటించకపోవడం వల్ల ఏళ్ల తరబడి సుదూర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లలోనే వారంతా పని చేయాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో పిఇటిలకు బదిలీల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తీసుకెళ్లాయి. త్వరలో జరిగే బదిలీల్లో పీడీలతో పాటు సమన్యాయం పాటించి బదిలీల్లో న్యాయం చేయాలని పిఇటిలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2023 మే నెలలో పిఇటి, పీడీల బదిలీలు చేపట్టింది. ఎన్నడూ లేని విధంగా పిఇటి, పీడీ లను వేరు చేస్తూ బదిలీలు చేపట్టింది. పీడీలకు ఆన్‌లైన్‌లో బదిలీలు నిర్వహించి, వారికి కోరుకున్న ప్రదేశాలను అప్పగించేలా చేసింది. తర్వాత డిఇఒ కార్యాలయంలో మాన్యువల్‌గా పిఇటిలకు బదిలీలు చేపట్టింది. పిఇటిలకు వచ్చిన పాయింట్లతో గాని, సర్వీస్‌తో గాని, స్పౌజ్‌తో గానీ సంబంధం లేకుండా, వారికి నచ్చిన ప్రదేశం అనగా జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉండే ప్రదేశాలు చూపించి కోరుకోవాలని చెప్పింది. బదిలీల్లో పిఇటి పోస్టులు ఉంటే కోరుకోవాలని, లేకుంటే లెఫ్ట్ ఓవర్ ఖాళీలు కింద పీడీలంతా కోరుకోగా మిగిలిన పోస్టులను ఎంచుకోవాలని ప్రభుత్వం జిఒ ఇచ్చింది. దీనివల్ల 45 పాయింట్లు వచ్చిన పిఇటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్ల సర్వీస్ ఉండి 10 పాయింట్లు వచ్చిన పీడీలకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రదేశాన్ని కోరుకునే విదంగా అవకాశం కల్పించారు. దీంతో 15 నుంచి 35 ఏళ్లపాటు సర్వీసులు ఉంటూ ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దిన తమకు అన్యాయం జరిగిందని పిఇటిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామన్ సీనియారిటీ ఇస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
బిపిఇడికి అవకాశం కల్పించాలి
ఇన్ సర్వీసులో వేతనంతో కూడిన బిపిఇడిని చేసుకునే విధంగా పిఇటిలకు అవకాశం కల్పిస్తే పీడీ లతో సమానంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పిఇటిల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
సర్వీసు అధారంగా బదిలీలు చేపట్టాలి
త్వరలో చేపట్టే ఉపాధ్యాయ బదిలీల్లో పిఇటిలకు స్కూల్ అసిస్టెంట్ పిఇటిలతో సమానంగా సర్వీస్ సీనియారిటీ, స్టేషన్ సీనియారిటీ, ఇతరత్రా పాయింట్లు లెక్కించాలి. జిల్లాలో మొత్తం ఖాళీలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇరువురికి వచ్చిన మొత్తం పాయింట్లు చూసి, కౌన్సిలింగ్ నిర్వహించి, న్యాయం చేయాలి. – కోలా లక్ష్మణరావు, పిఇటి
పిఇటిలకు అవకాశం కల్పించాలి
తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో పిఇటిలకు అవకాశం ఇస్తే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రెండు కంటే ఎక్కవ పీడీ పోస్టులు ఉన్న చోట పిఇటికి అవకాశం ఇవ్వాలి. ఇన్ సర్వీస్ బిపిడి చేసే అవకాశం పిఇటిలకు కల్పించాలి. సీనియర్ పిఇటిలకు జిల్లా కేంద్రానికి సమీపంలోని పాఠశాలల్లో రెండో పోస్ట్ కల్పిస్తే సముచితంగా ఉంటుంది.- జి.లక్ష్మణరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు
