ప్రజాశక్తి- శృంగవరపుకోట : గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పంపిణీ చేసిన జగనన్న ఇళ్ల స్థలాలు విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని సర్వే నంబర్ 147లో భారీ అవకతవకలు జరిగాయని ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు గతంలో ఆందోళనలు, ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జగనన్న ఇళ్ల స్థలాలకు భూసేకరణ, ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో అప్పటి తహశీల్దార్‌గా పని చేసిన రామారావు ఇష్టాను సారంగా ఆయనకు నచ్చిన వారికి, అనర్హులకు పొజిషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు, నలుగురికి మండలంలోని వేరువేరు చోట్ల ఇళ్ల స్థలాలను కేటాయించారు. మండలంలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీలో నిబంధనలు పాటించలేదని నచ్చిన వారికి నచ్చిన విధంగా స్థలాలను కేటాయించారని భూముల గోల్మాల్ విషయంలో అప్పట్లో పెద్ద దుమారం రేగినప్పటికీ వైసిపి ప్రభుత్వం అండతో ఎన్ని ఫిర్యాదులు చేసిన స్పందించిన దాఖలాలు లేవు.70 శాతం అనర్హులేపట్టణంలోని సర్వే నంబర్ 147 జగనన్న కాలనీలో 70 శాతం ఇళ్ల పట్టాలు అనర్హులకే ఇచ్చారని అర్హులను గుర్తించి అనర్హుల పట్టాలను రద్దు చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వబ్బిన సత్యనారాయణ, వబ్బిన సన్యాసినాయుడు ఆ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ధర్నాలు నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఆర్‌డిఒకు ఫిర్యాదు147 సర్వే నంబర్ సుమారు 1150 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయగా అందులో అధిక శాతం వైసిపి నాయకులకు, రెవెన్యూలో పనిచేస్తున్న వారికి రికమండేషన్లపై బాగా ఆస్తిపాస్తులు ఉన్నవారికి కేటాయించినట్లుగా గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ అవకతవకలు జరిగాయని లబ్ధిదారుల వివరాలతో సహా సమాచారం ఇవ్వాలని ఆర్‌టి యాక్ట్ ద్వారా ఫిర్యాదు చేయగా 147 సర్వే నెంబర్‌ల గల జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల పంపిణీ లబ్ధిదారుల వివరాలు ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు చేతులెత్తేయడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. 147 సర్వేనెంబర్ లేఅవుట్ ఇళ్ల స్థలాల కంపెనీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలలని ఆర్‌డిఒకు ఫిర్యాదు చేశాను.హనుమాన్ శెట్టి సన్యాసయ్య శెట్టి, సామాజిక కార్యకర్తఫిర్యాదులు వస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 147 సర్వేనెంబర్ లేఔట్ ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వస్తే విచారణ జరి చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ సూచనలతో అప్పటి ఎమ్మార్వో ఏ విధంగా స్థలాలను కేటాయించారో పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తాం. జిల్లా అధికారుల సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటాం.ఎం. అరుణకుమారి తహశీల్దార్ ఎస్‌కోట.
