ఫైలేరియా నివారణకు విస్తృత చర్యలు

Feb 16,2025 21:15

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఫైలేరియా నివారణకు విస్తృత చర్యలు చేపడుతున్నామని ఫైలేరియా నివారణ జిల్లా అధికారి జి.వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఈ నెల పదో తేది నుంచి మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రాం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ రాష్ట్రంలో, దేశంలో సమాచారాన్ని బట్టి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం బలిజిపేట, గుర్ల మండలాల్లో ఫైలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ఫైలేరియా నివారణ అధికారి ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు….
ప్రస్తుతం ఫైలేరియా కేసులు ఎన్ని? ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి.?
పార్వతీపురం మన్యం జిల్లాలో 333, విజయనగరం జిల్లాలో 82 చొప్పున ఫైలేరియా కేసులు ఉన్నాయి. వీటిలో మన్యం జిల్లాలోని బలిజిపేట మండలంలోనే అత్యధికంగా 307 వరకు ఉన్నాయి. బలిజిపేట మండలం పెదపెంకిలో అత్యధికంగా 192 మంది బోధవ్యాధితో బాధపడుతున్నారు. ఇదే మండలం నారాయణపురంలో 20 మంది, బలిజిపేటలో 11 మంది, చిలకలపల్లిలో 15, అరసాడ పిహెచ్‌సి పరిధిలో 35 మంది, గళావల్లి పిహెచ్‌సి పరిధిలో 30 మంది ఫైలేరియాతో చికిత్స పొందుతున్నారు.
విజయనగరం జిల్లాలో పరిస్థితి ఏమిటి.?
గుర్ల మండలాల్లో 82 ఫైలేరియా కేసులు ఉన్నాయి. ఒక్క గూడెం గ్రామంలోనే 58 వరకు ఉన్నాయి. ఆ గ్రామంలో ఈ ఏడాది కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో గుర్ల, మన్యం జిల్లా బలిజిపేట మండలంలోనే కేసులు ఉన్నాయి.
ఫైలేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
ఫైలేరియా బాధితులు ఉన్న గ్రామాలతోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాలపై సైతం దృష్టి కేంద్రీకరించి, మందులు పంపిణీ చేస్తున్నాం. రాత్రి పూట రక్తనమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారించడం, పాజిటివ్‌ కేసులకు జాప్యం లేకుండా మందుల పంపిణీ చేయడం వంటి చర్యలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది.
మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రాం అంటే ఏమిటి.?
ఫైలేరియా కేసులు పెరుగుతున్న చోట కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రాం చేపడుతున్నాం. దేశంలో 111 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. మన రాష్ట్రంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రమే అమలవుతోంది. ఇక్కడ కేసులు అదుపులోకి రాకపోవడమే ఇందుకు కారణం. ఈ కార్యక్రమంలో భాగంగా ఫైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నాం.
జిల్లా అంతటా పంపిణీ చేస్తున్నారా.?
లేదు… లేదు… ఫైలేరియా కేసులు నమోదైన గ్రామాలతోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రమే ఈ మాస్‌ డ్రగ్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నాం. ముందుగా చెప్పినట్టు బలిజిపేట మండలం బలిజిపేట, అరసాడ, గళావల్లి, గుర్ల మండలం మండలం గుర్ల, తెట్టంగి పిహెచ్‌సిల పరిధిలోని 95 గ్రామాల్లో రెండేళ్లలోపు గలవారు, గర్భిణుులు మినహాయించి మిగిలిన వారందరికీ అక్కడికక్కడే మాత్రలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో భాగంగా కొత్త కేసులను గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం.
మందుల పంపిణీ ఎంత వరకు వచ్చింది.?
మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు గ్రామ సచివాలయాలు లేదా ముఖ్యకూడళ్ల వద్దకు వచ్చిన వారికి అక్కడికక్కడే మాత్రలు మింగించే పనిచేశాం. 13నుంచి 22 వరకు 10 రోజులపాటు ఇంటింటికీ వెళ్లి మిగిలిన వారందరితో మాత్రలు మింగించే కార్యక్రమం జరుగుతోంది. అప్పటికీ తప్పిపోయిన వారిని గుర్తించి 23 నుంచి మాత్రలు వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

➡️