ప్రజాశక్తి-శృంగవరపుకోట : పట్టణంలో గౌరీశంకర్ కాలనీ వద్ద జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ సోమవారం మహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ టిడిపి నాయకులు బీశెట్టి అరుణకుమారి పేరుతో మంజూరైన మద్యం షాపు ద్వారా ప్రస్తుతం పట్టణంలోని విశాఖ-అరకు రహదారిలోని ఆకుల డిపో వద్ద అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రకాశం మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దీనివల్ల మహిళల రక్షణకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌చేశారు.
జనావాసాల్లో ఉన్న మద్యం షాపులు తొలగించాలి
బొబ్బిలి : జనావాసాల్లో ఏర్పాటు చేసిన మద్యం షాపులను వేరే ప్రాంతానికి తరలించాలని మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ ఎక్సైజ్ అధికారులను కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో నిత్యం జనంతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు పక్కనే మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరగడంతోపాటు యువత మద్యానికి ఆకర్షణకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆయనతో కౌన్సిలర్లు ఇంటి గోవింద్, ఎస్.బాబు, వైసిపి నాయకులు రాజగోపాల్ ఉన్నారు.