ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలో రహదారులు అద్వాన్నంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, గొల్లపల్లి నుంచి తెర్లాం రోడ్డు, బాడంగి రోడ్లుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి శ్రీదాడితల్లి ఆలయం వరకు రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో వర్షం కురిస్తే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పిరిడి జంక్షన్, అలజంగి సమీపంలో రోడ్లుపై గోతులు ఉండడంతో లారీలు కూరుకుపోతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణికులు, ఆటో కార్మికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రంగరాయపురం నుంచి జె.రంగరాయపురం వరకు రోడ్డు అద్వాన్నంగా ఉండడంతో ప్రయాణికులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాడైపోయిన రోడ్లు బాగు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.పారాది బ్రిడ్జి తెచ్చిన తంటా అద్వానంగా రహదారులు బాడంగి: మండలంలోని ఆకులకట్ట నుంచి పినపెంకి వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ రహదారిలో వెళ్లే స్కూల్ విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు బురదలో నీళ్లల్లో వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడటం వల్ల విద్యార్థులు వాహనదారులు ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ రహదారి ఉందో తెలియని పరిస్థితుల్లో గోతుల్లో పడి గాయపడుతున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర లారీలు దిగిపోతున్నాయి. రోడ్డు మధ్యలో కూరుకుపోతున్న లారీలను లాగాలంటే బొబ్బిలి, సాలూరు నుంచి క్రేయిన్‌లు రావాల్సి వస్తుంది. వీటికి కూడా ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు రూ. 8వేల నుంచి రూ. 12 వేలు వరకూ వసూలు చేస్తున్నట్లు వాహదారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి గోతులను పూడ్చాలని కోరుతున్నారు.రాకపోకలకు తప్పని ఇబ్బంది వేపాడ: మండలంలోని సింగరాయి గ్రామస్తులు చినుకుపడితే చాలు.. రాకపోకలకు నరకయాతన పడుతున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే మొలనోతు నీటిలో దిగి వెళ్లాల్సి రావడమే అందుకు కారణం. వాహనాల రాకపోకలకు కూడా అవకాశం ఉండటం లేదు. సింగరాయి గ్రామం నుంచి నిత్యం విశాఖపట్నం కూలి పనులకు వెళ్తే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిల్లో రోజూ నీటిలో దిగి ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. గ్రామానికి చెందిన తమ్మయ్య చెరువు రోడ్డును ఆనుకుని ఉండటం, దాని అలుగు వద్ద మొలలోతు ఉండటంతో ఆ నీటిలో దిగి వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఫెన్సింగ్ వేయడం వల్ల నీరు బయటకు వెళ్లకుండా చెరువు అలుగు వద్ద రోడ్డుపై నిల్వ ఉండిపోతోంది. దీంతో గ్రామస్తులు ఆ నీటిలో దిగే ప్రయాణించాల్సి వస్తోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పించకపోతే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని గ్రామస్తులు నిరుజోగి కామేష్, గుమ్మడి దేవుడి బాబు, గేదెల కనకరావు, గేదెల సంతోష్, బోని రమేష్, గేదెల దేముడు హెచ్చరించారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని ఆకులసీతంపేట రోడ్డు, ఆతవ జంక్షన్ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ రోడ్లు గుండా ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు పడటంతో భారీ వాహనాలు అందులో దిగిపోయి అవస్థలు పడుతున్నాయి. రోడ్లు బాగుచేయడంపై ఆర్‌డబ్ల్యుఎస్ డిఇని వివరణ కోరగా ఖజానాలో డబ్బులు లేవని నిధులు మంజూరు చేస్తే తప్ప రోడ్లును బాగుచేయలేమని చెప్పారు.