పోలింగ్‌ అధికారిపైవైసిపి ఏజెంట్ల దాడి

May 13,2024 23:17

గజపతినగరం : మండలంలోని కొత్త శ్రీరంగరాజపురం పోలింగ్‌ కేంద్రం(100)లో పోలింగ్‌ ఆఫీసర్‌పై వైసిపి ఏజెంట్లు దాడి చేశారు. ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు సాయంత్రం వచ్చింది. ఆమెకు చూపు సరిగా లేకపోవడంతో తన సమీప బంధువు ఇజ్జిరోతు వెంకటరమణ అనే యువకుడు సహాయంగా వెళ్లాడు. అయితే ఆయన కూడా పిఒనే ఓటు వేయాలని కోరాడు. దీంతో ఆ వృద్ధురాలు వైసిపికి ఓటు వేయాలని చెబితే పిఒ రాంబాబు టిడిపికి ఓటు వేశారని ఆరోపిస్తూ వైసిపి ఏజెంట్లు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలింగ్‌ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ ఏజెంట్లతో పాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు కూడా దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొత్స.అప్పలనరసయ్య పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకుని పోలింగ్‌ నిలిపివేయాలని కాసేపు గొడవకు దిగారు. రెండు గంటల పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అనంతరం రిటర్నింగ్‌ అధికారి ఎంవి సూర్యకళకు మండల పార్టీ అధ్యక్షులు బూడి.వెంకటరావు, గ్రామ సర్పంచ్‌ పైడిపు నాయుడు ఫిర్యాదు చేయగా, ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతామని చెప్పి పోలింగ్‌ కొనసాగించారు. మరోవైపు పోలీసులు అక్కడికి చేరుకొని పిఒపై దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

➡️