మంచికలపూడిలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతున్న అప్పారావు
ప్రజాశక్తి – దుగ్గిరాల : ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధన కోసం 12న విజయవాడలో జరిగే మహాధర్నాలో ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. మండలంలోని మంచికలపూడిలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జెట్టి బాలరాజు, ఈమని అప్పారావు, నాయకులు వై.బ్రమేశ్వరరావు శనివారం సందర్శించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వంద రోజులు ఉపాధి హామీ పని పూర్తి చేసుకున్న వారికి అదనంగా పని దినాలు కల్పించాలని, జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరికీ పని చూపాలని, సమ్మర్ అలవెన్స్, పే స్లిప్పులు, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఉపాధి మేట్లకు రూ.5 పారితోషికం ఇవ్వాలని, వలస కార్మికులకు ఉచితంగా రవాణా సౌకర్యం, బియ్యం, గ్యాస్ బండ అందించాలని, ఉపాధి పనికి వెళ్లిన సందర్భంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, రెండెకరాల భూమి ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు, మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎస్సీ కాలనీకి రెండెకరాల శ్మశాన స్థలం కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పేదలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వీరు నిత్యం పొట్టకూటి కోసం ఆటో కార్మికులుగా, భవన నిర్మాణ కార్మికులుగా చేస్తున్నారని చెప్పారు. వీరిలో డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా ఉన్నారని, ఆ పనుల్లోనూ పోటీ పెరిగి చేతినిండా పని దొరక్క సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై పలువురు మరణిస్తున్న సందర్భాలు కూడా గుంటూరు జిల్లాతోపాటు పల్నాడు, అనంతపురం, సత్యసాయి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఎక్కడికక్కడ గ్రామాల్లోనే పనులు చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి నిధులు తగ్గించిందని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి పేదల పొట్ట గొడుతోందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ధర్నాచౌక్‌లో 12న ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాకు కూలీలు, పేదలు భారీగా తరలిరావాలన్నారు.
