పల్లె పండగ సగమే

Jan 16,2025 20:44

చేపట్టిన పనులు 2119

పూర్తయినవి 815

702పనులు మట్టివేసే దశలోనే

గోకులాలు అంతంత మాత్రమే

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో పల్లె పండగ సగం వరకే వచ్చింది. మిగిలిన పనుల్లో చాలా వరకు అర్థాంతరంగాను, ప్రారంభ దశలోనూ నిలిచిపోయాయి. ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో పల్లెపండగ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సిసి రోడ్లు, బి.టి.రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాన్ని గడిచిన అక్టోబర్‌ నెలలో ప్రభుత్వం చేపట్టిన సంగతి విధితమే. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు అందుబాటులో వున్నాయి. వీటిని వినియోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం వంటి పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చర్యలు చేపట్టారు. వీటితోపాటు గ్రామీణ సంస్కతిలో, జీవనంలో భాగమైన పశువులు తలదాచుకొనేందుకు, వాటికి సరైన రక్షణ కల్పించేందుకు గోకులం షెడ్లను కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటులో వున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా పల్లెపండుగ పనులను జిల్లాలోని అన్ని మండలాల్లో చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.149.85 కోట్లతో 2119 సిసి రోడ్లు, కాలువల నిర్మాణం పనులను తలపెట్టగా ఇప్పటి వరకు 2086 పనులు ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో పూర్తిచేసిన రోడ్లు, కాలువలు కేవలం 915 మాత్రమే. మరో 702 పనులకు సంబంధించి ఎర్త్‌ వర్కు వరకు మాత్రమే వచ్చాయి. 360 పనులకు సిమెంటు కాంక్రీటుపూత వేయడం వరకు వచ్చింది. 109 పనులు నెలాఖరులోగా పనులు పూర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. పల్లె పండగలో భాగంగా తలపెట్టిన గోకులాలు కూడా అంతంతమాత్రంగానే నిర్మితమయ్యాయి. జిల్లాలో మొత్తం 1614 గోకులం షెడ్లను రూ.30 కోట్ల అంచనా వ్యయంతో రైతులకు మంజూరు చేసిన సంగతి విధితమే. వీటిలో 980 గోకులాల నిర్మాణాన్ని మాత్రమే ప్రారంభించారు. పూర్తిచేసినవి కేవలం 499 మాత్రమే. నిర్మాణం ప్రారంభించిన గోకులం షెడ్లన్నింటినీ జనవరి నెలాఖరుకు పూర్తిచేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. గోకులం షెడ్లను మూడు రకాలుగా మంజూరు చేశారు. కేవలం రెండు పశువుల కోసం నిర్మించే షెడ్లకు రూ.1.15 లక్షలు, నాలుగు పశువుల కోసం రూ.1.85 లక్షలతో, ఆరు పశువుల కోసం రూ.2.30 లక్షలతో షెడ్లను మంజూరు చేశారు. ఈషెడ్ల నిర్మాణానికి అయ్యే వ్యయంతో ఉపాధిహామీ నిధుల నుంచి 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. 10శాతం మొత్తాన్ని గోకులం షెడ్డు నిర్మించే రైతు భరించాల్సి వుంటుంది. శాశ్వత స్థాయి నిర్మాణాలుగా ఈ షెడ్లను చేపట్టడంతో జిల్లాలో రైతాంగానికి పశువుల సంరక్షణ కోసం సొంత నిధులను వెచ్చించే భారం తగ్గడంతోపాటు పశువులకు అన్ని కాలాల్లోనూ మంచి రక్షణ, వసతి ఏర్పాటు చేసినట్లవుతుంది.

➡️