అయోమయంలో ఉపాధ్యాయులు

Jun 9,2024 23:50 #teacher, #transpar
పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు (ఫైల్‌ఫొటో)

రిలీవ్‌ కాలేక, డబ్బులు రాబట్టుకోలేక అవస్థలు

అక్రమ బదిలీలకు రూ.5 లక్షల ఖర్చు

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి

పాఠశాలల పున:ప్రారంభం వేళ కొత్త పాఠశాలలకు వెళ్తామనుకున్న ఉపాధ్యాయులకు ఆ ఆశ లేకపోగా, బదిలీ కోసం చేసిన ఖర్చు తిరిగి చేతికివచ్చేలాలేదు. నిబంధనలను పక్కనబెట్టి గత ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేయడంతో ఉపాధ్యాయులకు ఈ సమస్య ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల ముందు బదిలీ ఉత్తర్వులు జారీచేసి, ఎన్నికల కోడ్‌ ముగిశాక రిలీవ్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జారీ చేసిన ఉత్తర్వులతో బదిలీ అయిన ఉపాధ్యాయులు సంబరపడ్డారు. ప్రభుత్వం మారడంతో అక్రమ బదిలీలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల కోడ్‌కు ముందు 25 మంది ఉపాధ్యాయులను బదిలీచేశారు. కావాల్సిన చోటకు వెళ్లిపోవాలని ఉపాధ్యాయులు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ముట్టజెప్పారు. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి మొదలుకొని వివిధ స్థాయిగల విద్యాశాఖాధికారుల వరకు పాత్రవుందని ఆరోపణలున్నాయి. విద్యాశాఖ మంత్రి పాత్ర లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బదిలీలకు అవకాశం వుండదని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. సాధారణ బదిలీలతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన వారిని నచ్చిన చోటకు బదిలీచేసే దుస్సాంప్రదాయం ఎంతో కాలంగా సాగుతోంది. అక్రమ బదిలీపై వచ్చిన వారిపైనా, అందుకు సహకరించిన, తోడ్పడిన వారిపైనా ఎటువంటి చర్యలూ లేకపోవడంతో ఇదొక ఒరవడిగా మారింది. నగరంలోకి బదిలీపై రావడానికి అర్హతలేకపోయినా విద్యాశాఖ ఉన్నతాధికారులను పట్టుకొని తనకు కావాల్సిన ఉపాధ్యాయులను నగర పరిధిలోని పాఠశాలలకు తీసుకొచ్చిన పెద్దలు లేకపోలేదు. పలుకుబడి కలిగిన, పదవుల్లోవున్న వారికి కొంతమంది ఉపాధ్యాయులు డబ్బులు ఇచ్చి గ్రామీణ ప్రాంతం నుంచి నేరుగా నగరం నడిబొడ్డు పాఠశాలకు బదిలీ చేయించుకున్నారు. అక్రమ బదిలీలకు ఒక్కోసారి ఒక్కో ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఏ పలుకుబడీ లేని ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. ఎన్నికల కోడ్‌కు ముందు బదిలీ అయిన ఉపాధ్యాయులు 25 మందిలో ఎస్‌జిటిలు 18 మంది, వివిధ సబ్జెక్టులు బోధించే స్కూల్‌ అసిస్టెంట్లు ఆరుగురు, ఒక పీడీ వున్నారు. వీరిలో ఎక్కువ మంది ఏజెన్సీలో పనిచేస్తున్నారు. జికె.వీధి, పెదబయలు, చింతపల్లి, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అక్కడ నుంచి మైదాన ప్రాంతాల్లోని రావికమతం, నర్సీపట్నం, బుచ్చెయ్యపేట, భీమిలి, చినగదిలి, పెందుర్తి, నక్కపల్లి, గాజువాక మండలాలకు బదిలీ చేసుకున్నారు. ఈ మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు తమకు కావాల్సిన మండలాలకు బదిలీ చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ అక్రమ బదిలీలను నిలిపివేయడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవ్‌కాలేక, ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోలేక సుడుమడతలు పడుతున్నారు.

 

➡️