మాకు అన్యాయం చేస్తారా..?

Jun 9,2024 23:53 #hudhud houses, #madhurawada
ఆందోళన చేపట్టిన రైతులు, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు

– బక్కన్నపాలెం, కొమ్మాది, రేవళ్లపాలెం రైతుల ఆందోళన

ప్రజాశక్తి – పిఎం.పాలెం :

ఇళ్ల కేటాయింపులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ బక్కన్నపాలెం, కొమ్మాది, రేవళ్లపాలెంలకు చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ దగ్గర నుంచి తహశీల్దార్‌, ఎపి హౌసింగ్‌ కార్పొరేషన్‌ పీడీ వరకూ భూమి కోల్పోయిన తమకు ఇళ్లు ఇచ్చిన తరువాతనే ఇతరులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఇళ్లు ఇవ్వకుండా వేరే వాళ్లకు కేటాయించినట్టు తెలిపారు. జవహర్‌ నవోదయ విద్యాలయం వద్ద రైతుల నుండి ఎటువంటి నష్టపరిహారమూ ఇవ్వకుండా భూములు లాక్కున్నారని, సినిమా ఇండిస్టీ ఆర్థిక సాయంతో ఎన్‌టిఆర్‌ హుదూద్‌ ఇళ్లను నిర్మించారని గుర్తుచేశారు. దశాబ్దాల కాలం నుంచీ తాము ఆ భూముల్లో ఉన్నామన్నారు. 2017లో హైకోర్టులో కేసు వేయగా భూములు కోల్పోయిన రైతులకు ఇళ్లు ఇవ్వాలని కోర్డు కూడా ఆదేశించిందన్నారు. అయితే న్యాయమైన రైతులకు ఇళ్లు కేటాయించకుండా ఇప్పుడు ఉత్తర నియోజకవర్గానికి చెందిన వారికి కేటాయించడం అన్యాయమన్నారు. రైతులకు మద్దతుగా ఆరో వార్డు టిడిపి నాయకులు పోతిన ఎల్లంనాయుడు, నాగోతి వెంకటరావు, బంక పోతురాజు, సిపిఎం నాయకులు డి.అప్పలరాజు, ఎస్‌.పైడితల్లి, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఎం.రమణ తదితరులు నిలిచారు. కొంతసేపు రైతులకూ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికీ వాగ్వాదం నెలకొంది. అనంతరం హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఈఈ విజయలక్ష్మి ఘటనా స్థలానికి పిఎం.పాలెం పోలీసులతో చేరుకున్నారు. ఇళ్లు వేరే ప్రాంతానికి చెందిన 151 మందికి కేటాయించామని తెలియజేశారు. ఇంకా 150 ఇళ్లు ఉన్నాయని, తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి రైతులు ఒప్పుకోలేదు. తమకు న్యాయం జరిగేంత వరకూ కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకూ ఇళ్లలోకి ఎవరినీ అనుమతించబోమని అధికారులు తెలియజేశారు.

 

➡️