మహోన్నతుడు.. పర్సా

Jun 9,2024 00:53 #'Parsa', #citu parsa
పర్సా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

ఆంధ్ర రాష్ట్ర కార్మికోద్యమంలో మహోన్నతమైన వ్యక్తి పర్సా సత్యనారాయణ అని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ కొనియాడారు. శనివారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. తొలుత కార్మికోద్యమ నేత పర్సా సత్యనారాయణ, ఇటీవల మృతిచెందిన అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు తులసి, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడారు. పర్సా ఆంధ్ర రాష్ట్ర కార్మికోద్యమంతో మమేకమై పనిచేశారన్నారు. జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని తెలిపారు. సింగరేణి బొగ్గు గనులలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం రాష్ట్ర కార్మిక ఉద్యమానికి దిక్సూచిగా నడిచిందన్నారు. 1970లో సిఐటియు ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారని తెలిపారు. విశాఖపట్నంలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. కార్మికలోకం మాసపత్రికను తీసుకురావడంలోనూ, దాన్ని పంపిణీ చేయడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయాలంటే ప్రత్యేకంగా పత్రిక ఉండాలన్న అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారన్నారు. పర్సా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పుస్తకాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ముద్రించిందని, ఆ పుస్తకాన్ని ప్రతి కార్యకర్తా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యు.రామస్వామి, కెఎం.కుమార్‌ మంగళం, పి.వెంకటరెడ్డి, వై.రాజు, జి.అప్పలరాజు, కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, బి.జగన్‌, ఎం.సుబ్బారావు, యు.రాజు, ఒ.అప్పారావు, ఆర్‌.లక్ష్మణమూర్తి, ఎస్‌.పద్మ, మంగశ్రీ, కొండమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

➡️