ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ :
దళితుల భూములకు నష్టం చేకూర్చే జిఒ 596ను తక్షణం రద్దు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో టి.చిరంజీవి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లోనూ, విజయనగరం జిల్లాలోని భోగాపురం చుట్టుపక్కల మండలాలైన పూస పాటిరేగ, డెంకాడల్లోనూ దళితుల భూములను జిఒ 596ను అడ్డం పెట్టుకొని భూబకాసురులు దౌర్జన్యంగా కాజేసారన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 27 దళితుల పథకాలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలా సబ్‌ప్లాన్ నిధులను జనరల్ పథకాలకు మళ్లించకూడదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను ప్రారంభించాలని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్పొరేషన్లకు నిధులు కేటాయించి, దళిత, గిరిజన, బలహీనవర్గాల యువతకు స్వయం ఉపాధి పథకాలకు రుణాలను మంజూరు చేయాలని, దళిత గిరిజన పేటలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాగం లక్ష్మి, జిల్లా అధ్యక్షులు ఎం.సుబ్బన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి.ప్రసాదరావు, జిల్లా ఉపాధ్యక్షులు వైటి.దాస్, వై.రాజు, నాయకులు పెంటారావు, పైడితల్లి తదితరులు పాల్గొన్నారు.