కార్మిక పక్షపాతి గొల్లపల్లి సుబ్బారావు

Apr 1,2024 16:31 #visakhapatnam

 సుబ్బారావు ప్రథమ వర్ధంతి సభలో వక్తలు
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : కార్మికపక్షపాతి, ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్‌ గొల్లపల్లి సుబ్బారావు అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ కొనియాడారు. జి.సుబ్బారావు ప్రథమ వర్ధంతి సభ మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఉన్న సిఐటియు ఆఫీస్‌ వద్ద జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు ముందు సుబ్బారావు చిత్రపటానికి సిఐటియు సీనియర్‌ నాయకులు పీతల అప్పారావు, అనపర్తి అప్పారావు, నాయకులు కుమార్‌, జె.ఆర్‌.నాయుడు, ఆదినారాయణ, కుమారి, వెంకటరావు, శ్రీను, రాజు, వరలక్ష్మి, విజయలు పూల మాల వేసి నివాళర్పించారు. యూనియన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కుమార్‌ ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడుతూ సుబ్బారావు మున్సిపల్‌ యూనియన్‌ ఉమ్మడి ఆంధ్రరాష్ట్రం నుండి రాష్ట్ర అధ్యక్షులుగానూ, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి కార్మికుల శ్రేయస్సుకోసం ఎనలేని కృషి చేసారన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ప్రారంభంలో కాంట్రాక్టర్‌ 800 రూ॥లు ఇచ్చి కార్మికుల శ్రమను దోపిడిచేయడాన్ని గమనించి గాజువాక ప్రాంతంలో యూనియన్‌ స్థాపించారన్నారు. సుబ్బారావు, వెంకటరెడ్డి మంచి స్నేహుతులుగా మెలిగి నేడు పారిశుధ్య కార్మికులకు 21వేలు, యుజిడి కార్మికులకు 24500 రూ॥లు జీతాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి అనేక కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా అలుపెరగని పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన విషయాన్ని గుర్తుచేసారు. సుబ్బారావు అటు అధికారులతోనూ, పోలీసులతోనూ, కార్మికులతోనూ తనదైన శైలిలో వ్యవహరించేవారన్నారు. సుబ్బారావు గాజువాక ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలను, కార్మికులను కలుపుకొని వెళ్ళి సంఘాలు పెట్టి సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించేవారన్నారు. సిపిఎం పార్టీ, సిఐటియు గాజువాక పట్టణ కార్యదర్శి నుండి జిల్లా కమిటీ, రాష్ట్ర నాయకుడుగా బాధ్యతలు చేపట్టి మంచి ఆదరణ పొందిన వ్యక్తిన్నారు. నేడు మోడీ, జగన్మోహన్‌, చంద్రబాబు,పవన్‌ కళ్యాణ్‌ కార్మికుల ద్రోహంచేస్తున్నారని, స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, కార్మిక చట్టాలు యజమానులకు అనుకూలంగా మార్చి ద్రోహానికి ఒడిగట్టారన్నారు. యూనియన్‌ బలపర్చిన వామపక్షపార్టీలను గెలిపించుకున్నట్లైతే మన సమస్యలు పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందన్నారు. జివిఎంసి యూనియన్‌ జిల్లా కార్యదర్శి జె.ఆర్‌.నాయుడు మాట్లాడుతూ ఇటీవల కాలంలో 16రోజులు సమ్మె చేసి అనేక హక్కులు సాధించుకున్నామన్నారు. సుబ్బారావు చూపిన మార్గంలో కార్మికులు నడవాలన్నారు. పర్మినెంట్‌ అయ్యేవరకు పోరాటాలకు సిద్ధంకావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి పి.వెంకటరావు, ఐద్వా జోన్‌ కార్యదర్శి కె.కుమారి, జివిఎంసి వార్డు బాద్యులు వరలక్ష్మి, రాజు, చెల్లయ్యమ్మ, కొండమ్మ, శ్రీదేవి, విజయ, వెంకటరమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️