సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకుల హౌస్ అరెస్టు
ప్రజాశక్తి-యంత్రాంగం (అనకాపల్లి జిల్లా) : ప్రభుత్వం మారినా తీరు మారలేదు. గృహనిర్బంధాలు ఆగలేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సిపిఎం నాయకులను నిర్బంధించడం పరిపాటిగా మారింది. అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఇందుకు అద్దం పడుతోంది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్దగల పోలవరం ఎడమ కాలువ పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరం అగ్రహారం గ్రామంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును, అచ్యుతాపురంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రామును, చోడవరంలో సిఐటియు నేత జి.వరలక్ష్మిని, అల్లూరి జిల్లా పాడేరులో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్సను, జిల్లా నాయకులు వంతల దాస్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భాల్లోనూ సిపిఎం నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు.
సిపిఎం ఖండన
సిపిఎం నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం తీవ్రంగా ఖండించారు. ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైనా, జిల్లాలోని అనేక సమస్యలపైనా నిలదీస్తారని భయమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరును సిపిఎం ఖండిస్తోందని పేర్కొన్నారు. అణచివేత, నిర్బంధ చర్యలను మానుకోవాలని, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు.